పాపన్నపేట, ఆగస్టు20: వర్షాకాలం వచ్చిందటే చాలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పాముల బెడద ఉంటుంది. పాము కాటుకు గురై పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటారు. సైన్స్ ఇంతగా పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మంత్రతంత్రాలు, ఆకు పసర్లను నమ్ముతుంటారు. చివరి నిమిషాల్లో డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు. నాటు వైద్యం నమ్మకుండా వైద్యుల వద్దకు వెళితే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి. రైతులు రాత్రుల్లో పొలం గట్ల వెంట నడిచేటప్పుడు పాము కాట్లకు గురవుతుంటారు. కొన్నిసార్లు గుడిసెలు, పూరిళ్లలో దొడ్లలో ఉన్నప్పుడు, బహిర్భూమికి వెళ్లినప్పుడు కూడా ప్రజలు పాము కాట్ల బారిన పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏ మంత్రకాడి దగ్గరకో లేదా ఏ నాటు వైద్యుని దగ్గరికో జనం పరిగెత్తుతారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత కొంత కాలం క్రితం పాపన్నపేట మండలంలోని దౌలాపూర్కు చెందిన ఇరువురు పదేండ్లలోపు అన్నదమ్ములకు పాము కాటు వేయగా నాటు వైద్యుడి వద్దకు వెళ్లడంతో జింకరామ్చరణ్ మృత్యువాత పడ్డాడు. అతడి తమ్ముడు నర్సింలు హైదరాబాద్లో చికిత్స పొంది, ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక మంత్రగాళ్లను నమ్మి సమయం వృథా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరి కొంతమంది నాటు వైద్యం నమ్మి ఇబ్బందుల పాలవుతారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా పాము కాటుకు గురైతే ముందుగా ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే దవాఖానకు తరలించడం మంచిది.
– బి.నాగరాణి,ఉపాధ్యాయురాలు, పాపన్నపేట
అందుబాటులో యాంటివెనమ్
చాలామంది పామే కరవగానే ఏం చేయాలో తోచక, నాటు వైద్యుల వద్దకు తీసుకెళ్లి సమయం వృథా చేస్తారు. దీంతో అప్పటికే పేషెంట్ దేహంలో విషం పూర్తిగా చేరుతుం ది. దీంతో ప్రాణాల మీదకు వచ్చా క డాక్టర్ వద్దకు తెస్తే ఫలితం ఉండదు. పాము కాటుకు గురి కాగానే పైకి రక్త ప్రసరణ జరగకుండా వెంటనే కట్టుకట్టి దవాఖానకు తీసుకువస్తే యాంటీవెనమ్ ఇంజక్షన్ చేస్తాం. బాధితుడు కోలుకుంటాడు.
– డాక్టర్ హరిప్రసాద్. వైద్యాధికారి, పాపన్నపేట
ఏ పాము కాటైనా విషమున్నా, లేకున్నా సరైన వైద్య నిపుణుల వద్దకు వెళ్లడం శ్రేయస్కరం.
డాక్టర్లు టీటీ యాంటీబయోటిక్, యాంటివినమ్ మొదలైన ఇంజక్షన్లతో వైద్యం చేస్తారు.
దీంతో బాధితుడు దాదాపు ప్రాణాలతో బయటపడతాడు.
మంత్రతంత్రాలు, నాటువైద్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.
పాము కాటుకు గురైన వ్యక్తి విష ప్రభావంతో కంటే భయంతో చనిపోయిన సందర్భాలే ఎక్కువ.
పాము కాటుకు గురైన వ్యక్తిలో మానసిక ైస్థెర్యం నింపడం ఎంతైనా అవసరం. బాధితుడిలో భయం లేకుండా చూస్తే ప్రాణాలకు ముప్పుకలగదు.
మనకు తారస పడే పాముల జాతుల్లో మెజారిటీ పాముల విషం లేనివే.
తెలుగు రాష్ర్టాల్లో మన చుట్టుపక్కల నివసించే పాముల్లో కేవలం నాగు పాము, కట్ల పాము, రక్త పెంజరలు మాత్రమే విషపూరితమైన సర్పాలు. ఇవే అత్యంత ప్రమాదకరమైనవి.
మిగిలిన పాముల జాతుల్లో ఏపాము కరిచినా పెద్దగా ఏమీ ప్రమాదం ఉండదు.
విషరహిత సర్పాలు కాటు వేసిన వారికి, ఫస్ట్ ఎయిడ్, మాములు వైద్యం చేస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాటు వేసింది ఏ రకం పాము తెలియక పోవచ్చు.