ఫ్లోరైడ్ రక్కసి నుంచి తమ బతుకులను రక్షించిన అపర భగీరథుడిని చూసేందుకు అభిమానం వెల్లువెత్తింది. రైతు బంధుతో ఎవుసానికి సాయమై, రైతు బీమాతో వందల కుటుంబాలను నిలబెట్టిన రైతు బాంధవుడి మాట వినేందుకు కర్షకలోకం కదిలివచ్చింది. పెండ్లికి మేనమామ కట్నం అందుకున్న పేదింటి ఆడబిడ్డలు, పెద్దకొడుకును చూసేందుకు చేతి కర్ర ఊతంగా వృద్ధులు, కష్టాల కడలిని దాటిన నేతన్నలు, కడుపులో బిడ్డతో నిండు గర్భిణులు, మోదీ దెబ్బకు డీజిల్ ధరలతో బతుకు బండిని లాగలేక పోతున్న డ్రైవర్లు.. ఇలా సబ్బండ వర్గాల ప్రజలు పిల్లాపాపలతో మునుగోడుకు తరలివచ్చారు. వేల వాహనాలు.. ఎటుచూసినా గులాబీ రెపరెపలు.. ఊరూరా ఘన స్వాగతాలు.. ధూంధాం పాటలు.. బతుకమ్మ ఆటలు.. సంప్రదాయ నృత్యాలు, పచ్చికుండ బోనాలు.. కోలాటాల దరువుతో మునుగోడు ప్రజా దీవెన సభను పండుగ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ఉత్సాహంగా వింటూ చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. ఉప ఎన్నిక వేళ నిండు దీవెనలు అందించారు.
ఇది మన జీవితాల ఎన్నిక
ఇక్కడ ఏం అక్కర ఉందని వచ్చింది ఉప ఎన్నిక. ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే. ఇప్పుడు నడుమల ఎవర్ని ఉద్దరియ్యడానికి. ఎవల్ల సంక్షేమం కోరి! ఎవల్ల మంచికోరి!! దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటో గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. మునుగోడులో జరిగేది పార్టీల ఎన్నిక కాదు. మన జీవితాల ఎన్నిక. మన బతుకుదెరువు ఎన్నిక. మునుగోడు చైతన్యమైన గడ్డ. ఇక్కడి మెజారిటీ దేశానికి సందేశం కావాలె.
– సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ సర్కారుతోనే మునుగోడు మంచిగైంది
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంకనే మునుగోడు మంచిగైంది. మా నియోజక వర్గాన్ని ఇంతకుముందు పట్టించుకున్న నాయకుడు లేరు. మోదీతోనే దేశం బాగుపడుతదనుకుంటే నాశనం అయితున్నది. డీజిల్ రేట్లు పెంచి మాలాంటి డ్రైవర్ల కడుపు కొడుతున్నడు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మునుగోడు మరింత అభివృద్ధి అయితది. బీజేపీని ఓడించి బుద్ధి చెప్తాం.
– ఐతరాజు రవి, డ్రైవర్, మునుగోడు
సీఎం కేసీఆర్ వెంటే యూత్
కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. అందరి బాగుగోల గురించి ఆలోచిస్తారు. మునుగోడు నియోజకవర్గంలోని యూత్ మొత్తం కేసీఆర్ వెంటే ఉంటుంది. టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుంది.
– బీసం విజయ్‌కుమార్, మునుగోడు