నంగునూరు, ఆగస్టు 20 : పైరవీ లేకుండా.. పూర్తి ఉచితంగా ప్రతి పేదోడికి ఇల్లు అందించడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో 23 డబుల్ బెడ్రూం ఇండ్లకు మంత్రి గృహ ప్రవేశాలు చేయించారు. లబ్ధిదారులకు ఇంటి ధ్రువపత్రాలు అందజేశారు. వికలాంగ లబ్ధిదారుడికి ఇల్లు వచ్చిన సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. త్వరలోనే తమ ఇంటి అడుగు జాగాలో ఇల్లు కట్టుకునే వారికి వెసలుబాటు కల్పిస్తూ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్మెంట్కు కూడా సరిపోయేవి కావన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి, లబ్ధిదారుల చేతిలో తాలంచెవి పెడుతున్నదన్నారు. మండుటెండలో మీ గ్రామ ఊర చెరువు మత్తడి దూకుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్తోనేనని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఉన్నదా.. అని ప్రశ్నించారు.
ఉచితాలు వద్దని కార్పొరేట్లకు రుణమాఫీ
మోదీ ప్రభుత్వం ఉచితాలు వద్దని, పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని, కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఉచితాలు వద్దని ఎద్దేవా చేయడం సరికాదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏ పైరవీ లేకుండా షాదీముబారక్, కల్యాణలక్ష్మి అందిస్తున్నదని వివరించారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మరింత న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కోరినా, కేంద్రం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు 24 గంటలు రావాల్సిన ఉచిత కరెంటును కేంద్రం కట్ చేసిందని, బాయికాడ మీటర్లు పెడితే రూ.6500 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తామని ఆశ చూపిందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం బాయికాడ మీటర్ పెట్టలేక పోవడంతో రాష్ర్టానికి రావాల్సిన రూ.6500 కోట్లను కేంద్రం ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచితే, ప్రజల సొమ్మును బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు పంచిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కోతలు లేకుండా నాణ్యమైన కరెంటును రైతులకు ఇస్తుంటే కండ్లు మండిన బీజేపీకి తెలంగాణ ప్రజలకు కరెంటు రాకుండా అడ్డుపడుతున్నదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఏ వర్గం బాగుపడ్డదో.. ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి నేడు తెలంగాణలో జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సర్పంచ్ పంగ కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.