స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు వేసిన రంగురంగుల రంగవల్లులు హరివిల్లులను తలపించాయి. ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు ముగ్గులను పరిశీలించి, విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు.
మెదక్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీ నుంచి చేపట్టిన ఆయా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని తెలియజేసేలా పాల్గొనడం సంతోషకరమని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయగా, అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రతిమాసింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం 13 రోజులుగా చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు. అనంతరం కలెక్టరేట్లో మహిళలు వేసిన ముగ్గులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, అదనపు పీడీ భీమయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దేశం గర్వించేలా వజ్రోత్సవాలు
భారతదేశం గర్వించే విధంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నదని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని డీసీసీబీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ రన్‌ను వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ జెండాలతో స్వతంత్ర సమయోధులను స్మరించుకుంటూ డీసీసీబీ బ్యాంకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కోలాటం, నృత్యాలు, జాతీయ గీతాల మధ్య రన్ కొనసాగింది. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 15రోజులు పాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ దేశభక్తిని చాటుతున్నారన్నారు. దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను ముందుంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో శ్రీనివాస్, మేనేజర్ సంగమేశ్వర్, డైరెక్టర్లు అనంత్‌రెడ్డి, జగన్మోహన్, బ్యాంకు అధికారులు, సిబ్బంది, డైరెక్టర్లు పాల్గొన్నారు.