
రామాయంపేట, జనవరి 29 : ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు. కాలక్రమేణా ప్రైవేటు పాఠశాలలు హంగు, ఆర్భాటాలతో ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తల్లిదండ్రులు కూడా అధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటుకు అప్పజెప్పడంతో అనతికాలంలోనే వీటి సంఖ్య పెరిగిపోయింది. గత ప్రభుత్వాలు సైతం కార్పొరేట్‌కే మద్దతు పలకడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు దండుకునేవి. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ బడుల బలోపేతంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పించడంతో పాటు మంచి ఫలితాలు సాధించిన బడులను సక్సెస్ స్కూళ్లుగా ఏర్పాటు చేశారు. 2015 సంవత్సరంలో రామాయంపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, డి.ధర్మారం ఉన్నత పాఠశాలను సక్సెస్ స్కూళ్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రెండు పాఠశాలల్లో టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2015 నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో వేర్వేరుగా తరగతి గదులను కేటాయించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.
6వ తరగతిలో 73 మంది, 7వ తరగతిలో 73, 8వ తరగతిలో 90, 9వ తరగతిలో 70, 10వ తరగతిలో 88 మంది మొత్తం బాలికలు, బాలురు కలిపి 394 మంది విద్యనభ్యసిస్తుండగా అందులో 319మంది ఇంగ్లిష్ మీడియంలో చదువుతుండగా, కేవలం 75 మంది మాత్రమే తెలుగులో విద్యనభ్యసిస్తున్నారు. అయితే, రెండేండ్లుగా కరోనా కారణంగా ప్రైవేటు నిర్వాహకులు ఫీజులు వసూలు చేసి సరిగ్గా చదువు చెప్పకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపించారు. దీంతో, ప్రైవేటులో ఉన్న విద్యార్థులు సర్కార్ బడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ పాఠశాలలో చూసినా విద్యార్థుల సంఖ్య పెరిగింది. రామాయంపేట బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో గదుల కొరత ఏర్పడింది. అదనపు గదుల నిర్మాణం కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కాగా, సక్సెస్ స్కూల్‌గా ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు యోగా, మెడిటేషన్ తరగతులను నిర్వహిస్తున్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ టీచర్లు బోధన చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో తెలు గు, ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ సార్ ఆలోచన బాగుంది:అభినయ్ విద్యార్థి రామాయంపేట
సీఎం కేసీఆర్ సార్ ఆలోచన బాగుంది. పేదలైన మేము ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ బడుల్లో చేరాం. ఇక్కడ ఇంగ్లిష్ మీడి యంలో పాఠాలను చెబుతున్నారు. మాకేమీ ఇబ్బందులు లేవు. కేసీఆర్ సార్ ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మారుస్తామనడం సంతోషంగా ఉంది.
పేద విద్యార్థులకు సువర్ణావకాశం..:శనిగరం కనకయ్య, ఉపాధ్యాయుడు, నంగునూరు
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరం. సర్కారు బడుల్లో పేద విద్యార్థులు చదువు కుంటారు కాబట్టి ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తే వారు ఉన్నత చదువులు చదివే అవకాశం లభిస్తుంది.సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ‘మన ఊరు మన బడి’ గొప్ప కార్యక్రమం.
ఆంగ్లం విద్యకే విద్యార్థుల ఆసక్తి:రాధిక, హెచ్ఎం, బాలికల పాఠశాల, రామాయంపేట
రామాయంపేటలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2015 నుంచే 6, 7, 8, 9,10 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియంతో పాఠశాలను నడిపిస్తున్నాం. రానురానూ ఆంగ్ల మాధ్యమానికే తల్లిదండ్రులు, విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయినా తెలుగు, ఇంగ్లిష్ విద్యార్థులకు వేర్వేరుగా గదులను ఏర్పాటు చేసి బోధిస్తున్నాం.
ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల్లో చైతన్యం:స్వరూపారాణి, ఉపాధ్యాయురాలు, రామాయంపేట
ఇంగ్లిష్ పాఠాలతో విద్యార్థుల్లో చైతన్యం పెరిగింది. మాకు ఇంగ్లిష్‌లోనే చెప్పమని విద్యార్థులు అడగడం సంతోషంగా ఉంది. ప్రైవేటుకు దీటుగా ఇంగ్లిష్‌లో పాఠాలను బోధిస్తున్నాం. ఆరు నుంచి పది తరగతుల వరకు ఇంగ్లిష్, తెలుగు పాఠాలను చెబుతున్నాం. సెలవుల్లో సైతం ఆన్లైన్ క్లాసులను నడిపిస్తున్నాం.
ఆన్లైన్ క్లాసులతో ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాం:రిషిక, విద్యార్థిని, రామాయంపేట
ఆన్లైన్ క్లాసులతో ఎటువంటి ఇబ్బందులు లేవు. స్కూలుకు సెలవులు ఉన్నన్ని రోజులు టీచర్లు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. ఏదైనా అర్థం కాకుంటే మేము కూడా ఇంగ్లిష్‌లోనే టీచర్లను అడుగుతున్నాం. చాలా ఓపికగా సమాధానం చెబుతున్నారు.