సంగారెడ్డి అర్బన్, ఆగస్టు18: కేసుల దర్యాప్తులో అలసత్వం చూపవద్దని, వేగంగా దర్యాప్తు చేసి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న శారీరక, మానసిక దాడులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. నేరాల అదుపులో భాగంగా ఆయా సబ్-డివిజన్ల పరిధిలో కమ్యూనిటీ ప్రోగ్రాంలు నిర్వహించాలని డీఎస్పీలకు సూచించారు.
ఆన్లైన్ మోసాలు, అపరిచిత వ్యక్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కలిగించాలని తెలిపారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అలారమ్స్ ఏర్పాటు చేసేలా మేనేజర్లకు సూచనలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రమాద కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి సాగు లేదా సరఫరా చేయడం, సారాయి కాయడం, గుట్కాలు అమ్మడం నిషేధమని, ఈ చర్యలకు పాల్పడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఆయా గ్రామాల్లో మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని పోలీ స్ అధికారులకు సూచించారు. సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి, పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
మెదక్‌లో..
మెదక్ అర్బన్, ఆగస్టు18: పెండింగ్‌లో ఉన్న కేసులను చాలెంజ్‌గా తీసుకుని త్వరగా పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం జిల్లా సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి పరిష్కరించాలన్నారు. మహిళలు, పిల్లలు రక్షణలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
చట్టంపై సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్ కేసులు పరిష్కరించుకుంటూ బ్ల్యూ కోల్ట్స్, పెట్రో మొబైల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాల ఫంక్షనల్ వర్టికల్స్ గురించి వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. నేర విచారణ అధికారి కేసుల్లో శిక్షలు పడేలా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కోర్టులో ట్రయిల్ నడిచే సమయంలో పోలీస్ అధికారులు సాక్షులు మోటివేట్ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, డీసీఆర్బీసీఐ రవీందర్, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.