జిన్నారం, ఆగస్టు 18: గురుకులాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జీవితానికి వెలుగునిచ్చేది విద్య ఒక్కటేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడమ్ కప్ క్రీడల్లో భాగంగా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటలను గురువారం ప్రారంభించారు. అనంతరం మండల స్థాయి కబడ్డీ క్రీడలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.
విద్యార్థుల్లో జాతీయతను కలిగించేందుకు వజ్రోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. గురుకుల విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. 193 గురుకులాల్లో కేజీ నుంచి పీజీ అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రాజేంద్రనగర్‌లో ఐఏఎస్‌తో పాటు జేఈఈ, నీట్ స్టడీ సెంటర్లను ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు 260 గురుకులాలు ఉంటే ఇప్పుడు వెయ్యికి పెరిగాయన్నారు.
ఓట్ల కోసమే బీజేపీ రాజకీయం
ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులు కొందరు అర్హత, పరిపూర్ణమైన అవగాహన లేని వారు సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా.. అక్కడ ఇస్తున్న పింఛన్ ఎంత, కరెంటు ఇస్తున్నది ఎంత అని ప్రశ్నించారు. రెండు వందల పింఛన్ ఇవ్వడానికి, ఆరు గంటల కరెంటు ఇవ్వడానికి, కరెంటుకు మీటర్లు పెట్టడానికి ఉన్నదా బీజేపీ ప్రభుత్వం అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తరువాతనే అన్ని ప్రాంతాలను సీఎం అభివృద్ధి చేశారన్నారు. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని గుర్తుచేశారు. గురుకులాల నుంచి 542 మంది విద్యార్థులు జేఈఈ రాస్తే 467 మంది సీట్లు సాధించారన్నారు. 91వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు వెయ్యి కోట్లు కేటాయించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌తో కోరామన్నారు.
ఈ నిధులతో గిరిజన తండాలు, గ్రామాల రోడ్లు బాగు చేస్తామని చెప్పారు. గురుకులాల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా ఐదు వేలు ఖర్చు చేస్తున్నదన్నారు. గిరిజన గురుకులంలో బాలుర స్పోర్ట్ అకాడమిని భేష్‌గా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ రామచందర్ నాయక్, గురుకులాల అడిషనల్ కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, ఆర్సీవో కళ్యాణి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ దశరథ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సాంబ్యనాయక్, గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.