
చేగుంట, జనవరి 28 : కోరిన కోర్కేలు తీర్చే తల్లిగా మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి రేణుకా ఎల్లమ్మ భాసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పతరువుగా మారింది. శనివారం ఆలయ 22వ వార్షికోత్సవంతో పాటు ఎల్లమ్మ-జమదగ్నిల కల్యాణోత్సవం వైభవంగా జరగనున్నది. కర్నాల్‌పల్లి గౌడసంఘం, ఆలయకమిటీ చైర్మన్ జనగామరాములుగౌడ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయగా, వేలాదిగా భక్తజనం తరలిరానున్నది.
సుమారు 74ఏండ్ల క్రితం పచ్చని పంటపొలాల మధ్య రేణుకా ఎల్లమ్మ వెలిసింది. అమ్మవారికి గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిత్యం పూజలందుకుంటున్నది. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. నిత్యం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు ఆలయానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందు కలుగకుండా గౌడ సంఘం చూసుకుంటున్నది. యేటా మాఘ అమావాస్య సందర్భంగా రేణుకా ఎల్లమ్మ-జమదగ్ని కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజే ఆలయ వార్షికోత్సవ వేడుకలు, జాతర నిర్వహిస్తారు. కల్యాణోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆరు రోజుల పాటు బోనాలు తీస్తారు.
నిత్యం భక్తులతో కిటకిట…
ప్రతి నిత్యం ఎల్లమ్మ దేవాలయం వద్దకు వేలాది మంది భక్తులు వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు. కుటుంబంలో అనారోగ్యం చెందిన వారు, సంతానం లేని వారు, పుట్టు వెంట్రుకలు, పెండ్లిండ్లు, పుట్టిన రోజులు, 21రోజు, పెండ్లి రోజులు, తల నీలాలు, అమ్మవారికి ఒడి బియ్యం, బోనాలు సమర్పణ లాంటి అనేక పండగలను భక్తులు అక్కడికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు.