
పెద్దశంకరంపేట, జనవరి 28 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీత పారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విగ్రాం రామాగౌడ్ (80) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వారం క్రితం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేరారు. పెద్దశంకరంపేటకు చెందిన విగ్రాం రామాగౌడ్ వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి రాష్ట్ర గీతపారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్‌గా ఎదిగారు. 40 ఏండ్లుగా పెద్దశంకరంపేట మండల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. దివంగత మాజీ మంత్రి కరణం రామచందర్‌రావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ సొంత మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1960-70లో వార్డు సభ్యుడిగా, 1982 నుంచి 86 వరకు పంచాయతీ సర్పంచ్‌గా, జోగిపేట పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1987-92 సంవత్సరాల్లో పెద్దశంకరంపేట తొలి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995లో నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. 2002లో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2009లో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేయగా, 2014లో టీఆర్ఎస్లో చేరారు. రామాగౌడ్ మృతికి సంతాపంగా స్థానిక వ్యాపార, వాణిజ్య సముదాయాలను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు.
రామాగౌడ్ అంత్యక్రియలు పెద్దశంకరంపేటలో శుక్రవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. నారాయణఖేడ్, రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్ మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, స్నేహితులు, బంధువులు కడచూపు చూడడానికి భారీ ఎత్తున తరలివచ్చారు. అంత్యక్రియల్లో మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సంతాపం
ఉమ్మడి రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్, పెద్దశంకరంపేటకు చెందిన విగ్రాం రామాగౌడ్ మృతిపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. పెద్దశంకరంపేట ఎంపీపీ, జడ్పీటీసీ, పీఏసీఎస్ చైర్మన్‌గా రామాగౌడ్ ప్రజలకు సేవలందించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. విగ్రాం రామాగౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.