అందోల్, జూలై 26 : దళితుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. వట్పల్లి మండలం బుడాయిపల్లి, టేక్మాల్ మండలం అసద్మహ్మద్పల్లికి చెందిన పదిమంది లబ్ధిదారులకు పెట్క్లినిక్ యూనిట్లను మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి పంపిణీ చేశారు. దళితులు రూ. 10 లక్షలతో వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని ఇదంతా సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు. ఇలాంటి గొప్ప పథకాన్ని సైతం ప్రతి పక్షాలు రాజకీయం చేశాయని ఎవరెన్ని అసత్యాలు ప్రచారం చేసినా అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు అందుతుందన్నారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్‌గా నియోజకవర్గంలోని బుడ్డాయిపల్లి, అసద్ మహ్మద్పల్లి గ్రామాలను ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారులు జేసీబీలు, టెంట్‌హౌజ్, డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకున్నారని, డిమాండ్ బాగా ఉండడంతో మరికొందరు లబ్ధిదారులు పెట్క్లినిక్ వాహనాలు కొనుగోలు చేశారని చెప్పారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తగిన చర్యలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, నాయకుడు రాహుల్‌కిరణ్, బిజిలీపూర్ సర్పంచ్ పద్మయ్య, ఎంపీటీసీ నవీన సధానందం, వరం చైర్మన్ వీరారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు విజయలక్ష్మి, బాబూరావు, నాయకులు షాబొద్దీన్, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.