
మునిపల్లి, జనవరి 11: క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం అభిమానం ఉంటుంది. కొంతమంది ఆట చూసి ఆనందిస్తే, మరికొంత మంది తాము క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటారు. అందుకోసం అవసరమైన శిక్షణ తీసుకుంటూ నిత్యం శ్రమిస్తుంటారు. ఇదే తరహాలో తన కల నెరవేర్చుకునేందుకు కృషిచేస్తున్నది చిన్నారి షబ్నం. తండ్రే కోచ్‌గా మారి తన ‘కెప్టెన్’ అనుభవాన్నంతా కూతురికి నేర్పిస్తుండడంతో ఎనిమిదేండ్ల వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్నది. ఈ చిన్నారి ఆటతీరుకు క్రికెట్ అభిమానులను ఫిదా అవుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లికి చెందిన షబ్నం బ్యాట్ పట్టి ప్రతీ బాల్‌ను గ్రౌండ్ దాటిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తన కూతురుకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తే మరింత రాణిస్తుందని, దాతలెవరైనా సాయం చేస్తే హైదరాబాద్‌లో ట్రైనింగ్ ఇప్పిస్తానని తండ్రి ఉస్మాన్ అంటున్నాడు.
నిండా ఎనిమిదేండ్లు కూడా నిండని చిన్నారి క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నది. బ్యాట్ పట్టి చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నది. తండ్రి కోచ్‌గా మూడేండ్ల నుంచే క్రికెట్ పాఠాలు నేర్చుకుంటూ ట్రీ గార్డును నెట్‌గా ఉపయోగించుకుని ఆమె ఆడుతున్న తీరుకు క్రికెట్ అభిమానులను జేజేలు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లికి చెందిన ఉస్మాన్, నగినా దంపతుల పెద్ద కూతురు షబ్నం. ఎనిమిదేండ్లకే తనకంటే రెండింతల పెద్ద వయసువారితో క్రికెట్ ఆడుతూ తన బ్యాట్‌తో కండ్లు చెదిరే షాట్లను గ్రౌండ్‌కు అన్నివైపులా కొడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఏ స్కూల్లో చదివించాలి, ఇంటికి రాగానే ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం పాఠాలు చెప్పారు అంటూ నిత్యం వారిపై ఒత్తిడిని పెంచుతుండడంతో చాలామంది విద్యార్థులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, చదువు ఒక్కటే కాకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మానసికోల్లాసంతో పాటు వారిలోని ప్రతిభను వెలికితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నతనంలోనే అసమాన ప్రతిభ చూపిస్తున్న చిన్నారి షబ్నంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
తండ్రి ఆశయం నెరవేర్చేందుకు ఈ చిన్నారి మూడేండ్లకే క్రికెట్ బ్యాట్ పట్టింది. తండ్రి ఉస్మాన్ సదాశివపేటలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయంలో కూతురికి ఇంటి వద్ద ట్రీగార్డ్స్తో క్రికెట్ నెట్‌ను తయారుచేసి తానే కోచ్‌గా మారి ఆటలో మెళకువలు నేర్పించేవాడు. దీంతో రెండు సంవత్సరాల వయసు నుంచే క్రికెట్‌పై చిన్నారి మక్కువ పెంచుకున్నది. తన కూతురుని ఎలాగైనా గొప్ప క్రికెటర్‌ను చేయాలనే లక్ష్యంతో తండ్రి ఉస్మాన్ చిన్నారికి తర్ఫీదునిస్తున్నాడు.
బుసారెడ్డిపల్లి క్రికెట్ జట్టు కెప్టెన్ ఉస్మాన్…
షబ్నం తండ్రి ఉస్మాన్ 2004లో బుసారెడ్డిపల్లి బ్రిలియంట్ క్రికెట్ టీం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పట్లో తన అద్భుత ఆటతీరుతో అనేక సార్లు విజయాలు సాధించాడు. అయితే, తండ్రి గ్రామస్థాయిలో కెప్టెన్ కాగా, షబ్నం ఇండియన్ జట్టుకు కెప్టెన్ కావాలన్నదే ఏకైక లక్ష్యంగా క్రికెట్ ఆడుతున్నదని గ్రామస్తులు తెలిపారు.
నిరుపేద కుటుంబం…
ఉస్మాన్, నగినా దంపతులది నిరుపేద కుటుంబం. పెద్ద కూతురు షబ్నం క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపడంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో చిన్నారికి కావాల్సిన ఆట వస్తువులు కొనిపించారు. అయితే, షబ్నం ఆటతీరు రోజురోజుకీ మెరుగుపడుతుండడంతో హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పిస్తే మరింత రాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, ఆర్థికంగా తమకు ఆ స్థాయి లేకపోవడంతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు.
చదువుల్లో ముందంజ…
ఎనిమిదేండ్ల షబ్నం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలోని ఉన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నది. ఆటలతో పాటు చదువులోనూ షబ్నం ముందుంటున్నది. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూనే ఖాళీ సమయంలో బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్‌లో చేస్తుంది. దీంతో ఉపాధ్యాయులు కూడా చిన్నారికి షభ్నాన్ని ప్రోత్సహిస్తున్నారు.
నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం…
మా నాన్న గతంలో చాలా బాగా క్రికెట్ ఆడేవారు. మా కుటుంబ పోషణ కోసం ఆటను వదిలేసి కంపెనీలో పనిచేస్తున్నాడు. నాకు ఇంటి వద్దనే కోచింగ్ ఇచ్చి మెళకువలు నేర్పిస్తున్నాడు. నేను గొప్ప క్రికెటర్‌ను కావాలన్నది నాన్న కోరిక. ఎవరైనా సాయం అందించి హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పిస్తే ఇంకా మెరుగైన శిక్షణ తీసుకుని జాతీయ స్థాయిలో దేశం తరఫున ఆడేందుకు కృషి చేస్తాం.
దాతల సాయం అవసరం..
చిన్నారి ఆట చూసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తగిన సాయం అందిస్తే తనకు మంచి క్రీడా భవిష్యత్ ఉంటుంది. మాది పేద కుటుంబం కావడంతో కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించే స్థోమత లేక ఇంట్లో నేనే కోచింగ్ ఇస్తున్నా. నెట్ కొనే పరిస్థితి లేకపోవడంతో చెట్లకు పెట్టే ట్రీగార్డ్స్తో నెట్‌ను తయారు చేసి క్రికెట్ నేర్పిస్తున్నా.
చదువుల్లో మంచి మార్కులు..
షబ్నం మూడో తరగతి చదువుతున్నది. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో ఆణిముత్యం షబ్నం. ప్రభుత్వం స్పందించి మంచి కోచింగ్ ఇప్పించే విధంగా కృషి చేయాలి.