నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13;వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉన్నది. వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నారింజ, మంజీర, నల్లవాగు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మెదక్ జిల్లాలో వనదుర్గా, పోచారం ప్రాజెక్టుల్లో వరద పరవళ్లు తొక్కుతున్నది. మంజీర నది, హల్దీ వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిండుతున్నాయి. వర్షాలకు అనేక గ్రామాల్లో శిథిల ఇండ్లు కూలిపోయాయి. మంజీర తీర ప్రాంతంలో పంటలు నీటమునిగాయి. బుధవారం మెదక్ జిల్లాలో సరాసరి 36.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 48.5 మి,మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా చేగుంటలో 31 మి,మీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో సరాసరి 34.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కంగ్టి మండలంలో 52 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 22.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలు చేపడుతున్నారు. –
అల్పపీడనం కారణంగా ఐదారు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ఇంకా తెరిపివ్వలేదు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుండగా, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంకల్లో గంగమ్మ పరుగులు పెడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటపొలాల్లో పనులు చేసుకుంటుండగా, పలుచోట్ల పంట చేలల్లోకి వాననీరు చేరింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా, ఇండ్లు, చెట్లు కూలాయి. వర్షానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని, తక్షణ చర్యలు చేపడతామని భరోసా కల్పిస్తున్నారు. కాగా, బుధవారం మెదక్ జిల్లాలో 36.5 మి.మీ, సంగారెడ్డి జిల్లాలో 34.9 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల రాకతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పుష్కలంగా పడుతూ నదులు, చెరువు లు, వాగులు, వంకలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమైంది.
సంగారెడ్డి జిల్లాలో 34.9 మి.మీ వర్షపాతం
సంగారెడ్డి జిల్లాలో బుధవారం 34.9 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కంగ్టి మండలంలో 52 మిల్లీమీటర్లు కురవగా, జిన్నారం 48.4, గుమ్మడిదల 46.7, సిర్గాపూర్ 46, మొగుడంపల్లి 44.3, పుల్కల్లో 38.2, కల్హేర్‌లో 37, నారాయణఖేడ్, నాగిల్గిద్దలో 36.8, హ త్నూరలో 35.5, అందోల్‌లో 35.7, వట్పల్లి, చౌటకూర్ మండలాల్లో 34.8, మనూరు మండలంలో 34.1 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రామచంద్రాపురం మండలంలో 22.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలైలో సాధారణ వర్షపాతం 358.3 మిల్లీమీటర్ల కాగా, 551.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులను కలెక్టర్ శరత్ పరిశీలిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.
మెదక్ జిల్లాలో 36.5 మిల్లీమీటర్ల వర్షపాతం
మెదక్ జిల్లాలో బుధవారం 36.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 48.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, కొల్చారంలో 48.2 మి.మీ వర్షం కురిసింది. పాపన్నపేటలో 45.3 మి.మీ, నర్సాపూర్ 45.1 మి.మీ, కౌడిపల్లి 43.4 మి.మీ, నార్సింగి 43 మి.మీ, రామాయంపేటలో 39.2 మి.మీ, అల్లాదుర్గంలో 37.3 మి.మీ, టేక్మాల్ మండలంలో 35.2 మి.మీ, హవేళీఘణాపూర్‌లో 31.5 మి.మీ, నిజాంపేటలో 33 మి.మీ, శివ్వంపేటలో 38.1మి.మీ, తూప్రాన్‌లో 31.5 మి.మీ, చిలిపిచేడ్ మండలంలో 34.3 మి.మీ, చిన్నశంకరంపేట మండలంలో 32.9 మి.మీ, చేగుంటలో 31.0 మి.మీ, పెద్దశంకరంపేటలో 38.3 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పూర్తి స్థాయికి ప్రాజెక్టులు…
జిల్లాలోని పోచారం డ్యామ్, ఘనపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్నది. ఘనపూర్ ప్రాజెక్టు కూడా పొంగిపొర్లుతుండడంతో ఏడుపాయల వనదుర్గ్గా మాత ఆలయం ఎదుట నుంచి నీటి ప్రవాహం ఎక్కువైంది. అంతేకాకుండా జిల్లాలోని ఆయా మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.
చెరువులను పరిశీలించిన సంగారెడ్డి కలెక్టర్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ బుధవారం జిన్నారం మండలంలో పర్యటించారు. కొడకంచిలోని అమ్మ చెరువు, జిన్నారంలోని అక్కమ్మ చెరువులను అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, ఆర్డీవో నగేశ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. చెరువులకు వస్తున్న వరదపై అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిన్నారం అక్కమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవ, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ శరత్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జిన్నారంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో మాట్లాడారు. తహసీల్దార్ దశరథ్, ఎంపీడీవో రాములు పాల్గొన్నారు.
సింగూరుకు పెరుగుతున్న వరద ఉధృతి
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువనుంచి సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.423 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డిప్యూటీ ఈఈ నాగరాజ్ తెలిపారు. బుధవారం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 10,300 క్యూ సెక్యులు రాగా, అవుట్ ఫ్లో 400 క్యూ సెక్యులు బయటకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
‘సింగూరు’ను సందర్శించిన జడ్పీ చైర్పర్సన్
సింగూరు ప్రాజెక్టును బుధవా రం సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి సందర్శిం చి, వరద ప్రవాహంపై అధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమెవెంట తహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో మధులత, సింగూరు సర్పంచ్ రాజాగౌడ్, ప్రాజెక్టు అధికారులు తదితరులున్నారు.