నారాయణఖేడ్/జహీరాబాద్/కల్హేర్, జూలై 12: నల్లవాగు ప్రాజెక్టు నిండిందని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. సంబంధిత ఈఈ జైభీమ్ను ప్రాజెక్టు వివరాలను అడుగగా, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోకి వస్తున్న వరద , అలుగుపై నుంచి వెళ్తున్న నీటి వివరాలతో పాటు కాల్వలు, ఆయకట్టు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన తూం వద్దకు వెళ్లి పరిశీలించి, ఇబ్బందులు తలెత్తితే మా దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. ఆయన వెంట ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మైపాల్‌రెడ్డి, డీఈలు రవికుమార్, జలంధర్, ఏఈలు రవికుమార్, సూర్యకాంత్, తహసీల్దార్ రత్నం, ఎంపీడీవో సుజాత, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు విజయ్‌కుమార్, సంజీవరెడ్డి, బసిరెడ్డి, బాలాజీ, నాయకులు నర్సింహులు, గోపాల్, పోచాపూర్ మాజీ ఎంపీటీసీ కృష్ణాగౌడ్, రైతులు ఉన్నారు.
అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు
అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని కలెక్టర్ శరత్ హెచ్చరించారు. మంగళవారం నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. శాఖల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్ష జరిపిన కలెక్టర్ డివిజన్ పరిధిలో 180 చెరువులు మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేశామని, మరమ్మతులకు నోచుకుని చెరువులపై దృష్టిసారించాలని ఐబీ ఈఈ జైభీమ్‌కు సూచించారు.
ప్రమాదకరంగా ఉన్న వాగులు, కల్వర్టులను గుర్తించి తహసీల్, పోలీస్‌శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగే విధంగా చూడాలని, ప్రతిరోజూ చెత్తను సేకరించడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. వైద్యాధికారులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పీహెచ్‌సీలు, పీహెచ్సీ సబ్ సెంటర్లు, ఆశ కార్యకర్తల వద్ద మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఏవైనా ప్రమాదకర భవనాలు ఉంటే ఇతర భవనాల్లోకి మారాలని సాంఘిక సంక్షేమ ప్రత్యేకాధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కోతకు గురైన రోడ్డును పరిశీలన
నారాయణఖేడ్ మండలం ర్యాకల్, గంగాపూర్ గ్రామాల మధ్య కోతకు గురైన రోడ్డును జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. గంగాపూర్ చెరువు నుంచి ర్యాకల్ రిజర్వాయర్‌లోకి మళ్లించే నీటి ప్రవాహం కారణంగా రోడ్డు కోతకు గురైనట్లు జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, కలెక్టర్‌కు వివరించారు. వెంటనే ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాల్సిందిగా ఆదేశించడమే కాకుండా పనులను పర్యవేక్షించాల్సిందిగా ఆర్డీవోకు సూచించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ శరత్ అన్నారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి(కే), చిన్న హైదరాబాద్ వైపు నుంచి వాగును పరిశీలించి, కొత్తూర్(బి) గ్రామంలో నారింజ ప్రాజెక్టును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండలన్నారు. ఆయన వెంట జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ నాగేశ్వర్రావు, కొత్తూర్(బి) సర్పంచ్ జగన్మోహన్, మున్సిపల్ డీఈఈ దీప్‌చంద్, నీటిపారుదల శాఖ ఏఈ జానకిరామ్‌తో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.