
హవేళీఘనపూర్, డిసెంబర్ 21 :గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా రైతులు, కూలీలే ఎక్కువగా ఉంటారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తేనే ఆ ఇండ్లల్లో పండుగ వాతావరణం ఉంటుంది. కానీ, ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పేకాట, చిత్తుబొత్తు అంటూ చెడు వ్యసనాల బారిన పడ్డవారు బతుకులు ఆగం చేసుకుంటున్నారు. కుటుంబ పోషణ విడిచి చెడు వ్యసనాలకు అలవాటు పడడంతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పల్లెటూర్లలో ఇలాంటి వాతావరణం ఏర్పడడంతో బెట్టింగ్ బేరాలు, బతుకు భారాలు అవుతున్నాయి. చెడు వ్యసనాలకు బానిసలైన కొంతమందిలో రైతులు కూడా లేకపోలేదు. ఆత్మహత్య ఘటనలు ఎన్నో ఉన్నా కొన్ని కుటుంబాలు చెప్పుకోలేక వెలుగులోకి రావడం లేదనే ప్రచారం కూడా ఉన్నది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా పేకాట, చిత్తుబొత్తు లాంటి ఆటలు ఆడితే వెంటనే సమాచారం అందించాలని పోలీసు శాఖ వారు గ్రామాల్లో సూచనలు చేస్తున్నారు. అప్పులపాలై కుటుంబాలను ఆగం చేసుకోవద్దని సూచిస్తున్నారు.
లక్షల్లో నష్టం.. వస్తువుల తాకట్టు..
పల్లెటూరు ప్రాంతంలోని దాదాపు నిత్యం పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రతీ గ్రామంలో కొందరు మాత్రం బృందంగా ఏర్పడి బెట్టింగ్ మత్తులో తూలతూగుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మగా వచ్చిన డబ్బులను చిత్తుబొత్తు, పేకాట ద్వారా పోగొట్టుకుంటున్నారు. అదనంగా ఇంట్లో భార్యా, పిల్లలు చేసిన కష్టాన్ని సైతం ఈ వ్యవసనాల్లో పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆటల్లో కొందరు డబ్బులు వచ్చి సంతోషిస్తుంటే, మరికొందరు తిరిగి తమ డబ్బు వస్తుందనే ఆశతో చివరకు ద్విచక్ర వాహనాలు, నగలు సైతం తాకట్టు పెట్టి ఆడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో గొడవలు మొదలవుతున్నాయి.
డబ్బుల కోసం దొంగతనాల వైపు..
పేకాట, చిత్తుబొత్తు ఆటలకు బానిసైన కొందరు చివరకు ఇంట్లో ఉన్న మహిళల నగలు అమ్ముకోగా, మరేమీ చేయలేని పరిస్థితుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. డబ్బులు పోగా, నగలు అమ్మినా కూడా ఆటలో అవి కూడా పోవడంతో తిరిగి వస్తాయేమో అనే ఆశతో దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు. చిన్నచిన్నగా మొదలైన పేక, చిత్తుబొత్తు ఆటలు వ్యవసనంగా మారడంతో ఎందరో జీవితాలు దుర్భరమవుతున్నాయి.
ఆత్మహత్యలు..వీధిన పడుతున్న కుటుంబాలు..
బెట్టింగ్ వ్యవసనాలకు గురైన కొందరు ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబ ఇబ్బందులు భరించలేక పురుగుల మందు తాగో, ఉరివేసుకొని తనువు చాలిస్తున్నారు. కుటుంబాన్ని పెంచిపోషించాల్సిన కుటుంబ పెద్ద దిక్కు అయిన వారే ఇలాంటి పేకాట, చిత్తుబొత్తు ఆటలు బానిస కావడంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
రెండు గ్రామాల్లో 31మందిపై కేసులు
హవేళీఘనపూర్ మండల పరిధిలోని వాడి, ముత్తాయికోట గ్రామాల్లో పేక ఆడుతున్న 31 మందిపై కేసులు నమోదు చేసి, వారి నుంచి 16 సెల్ఫోన్లు, 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు హవేళీఘనపూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేక ఆడితే 100కు, స్థానిక పోలీసులకు సమాచారమందిస్తే, పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేక ఆడడంతో ఆర్థికంగా కుటుంబాలు నష్టపోయి వీధిన పడుతున్నాయన్నారు.
పక్కా సమాచారం ఇవ్వండి..
హవేళీఘనపూర్ మండలంలో ఆయా గ్రామాల్లో పేక ఆడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అటవీ ప్రాంతాలు, చెరుకు తోటల్లో ఆడుతున్నట్లు తెలిసింది. ఇటీవలే ముత్తాయికోట, వాడి గ్రామాల్లో పేక ఆడుతున్న వారిపై కేసులు పెట్టాం. పక్కా సమాచారమిస్తే, పేక ఆడుతున్న వారి పట్టుకొని కేసు నమోదు చేస్తాం.