ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, సాధారణ జనజీవనం స్తంభించింది. పలుచోట్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఆదివారం 49.2 మి.మీ వర్షపాతం నమోదవగా, 2314 చెరువుల్లో ఇప్పటి వరకు 15 అలుగు పారుతున్నాయి. పోచారం ప్రాజెక్టు పూర్తిస్ధాయిలో నిండింది. హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామం వద్ద చెక్‌డ్యాం మొదటిసారి నిండడంతో ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి జలహారతిపట్టి గంగమ్మకు పూజలు చేశారు. సంగారెడ్డిజిల్లాలో 4.4సెం.మీ వర్షం కురిసింది. వరద పెరగడంతో మహబూబ్‌సాగర్ చెరువు అలుగుపోస్తున్నది. మంజీరా, నారింజ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు కింద ఎనిమిది చెరువులు నింపేందుకు కుడి, ఎడమ కాల్వలకు 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మెదక్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలతో చెరువులు, కుంటల జలకళను సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లాలో 49.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదవగా అత్యధికంగా మెదక్ మండలంలో 67.4మిల్లీమీటర్ల నమోదైంది. వర్షా లు దంచికొట్టడంతో వాగులు పొంగుతుండటంతో ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెరుగుతోంది. మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.5 అడుగులు కాగా, ఆదివారం వరకు 22అడుగులకు చేరింది. పోచారం ప్రాజెక్టు నీటితో పొంగిపోర్లుతున్నది. చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామ శివారులో మంజీరానదిలో నిర్మించిన చెక్‌డ్యాం నిండకుండలా మారింది. జిల్లాలో 2314 చెరువులు ఉండగా ఇప్పటి వరకు 15చెరువులు అలుగులు పారాయి. మెదక్ పట్టణంతో పాటు ఆయా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను జలమయమయ్యాయి. కొల్చారం మండలంలోని ఎనగండ్ల, పాపన్నపేట మండలంలోని రామతీర్థంలో ప్రతాప్‌రెడ్డికి చెందిన ఇల్లు, టేక్మాల్ మండలంలో పలు ఇండ్లు వర్షానికి పాక్షికంగా కూలిపోయాయి.
మెదక్ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మెదక్ ఎస్పీ రోహిణీప్రియదర్శిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారక్షణలో జిల్లా పోలీసు అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని, పర్యవేక్షణలో పోలీసు స్పెషల్ బ్రాంచ్, ప్రత్యేక పోలీసులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. బాధితుల సహాయం కోసం 24/7 నిరంతర సహాయక చర్యలు అందిచండానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, వాగు లు, నదుల వద్ద ప్రమాదకరస్థాయిని పరిశీలించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న వాగులు, చెరువుల వద్ద పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసే పోలీ సు సిబ్బందిని ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100కానీ పోలీస్‌స్టేషన్‌కు కానీ, పోలీసు కంట్రోల్ రూం 08452-223533, 7330671 900కు సమాచారం అందించాలని కోరారు.
అప్రమత్తంగా ఉండండి
మెదక్ జిల్లాలో భారీ వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. అన్ని విభాగాల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. మున్సిపాలిటీ, పారిశుధ్య విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రాజెక్టుల్లోకి, చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వస్తున్నదని, ప్రజలు చెరువులు, ప్రాజెక్టుల్లోకి వెళ్లకూడదని సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో రోడ్డుకు, ఫుట్‌పాత్‌కు హోల్స్ చేసి డ్రైనేజీల్లోకి వర్షపు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. అంతేకాకుండా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
అల్పపీడనానికి తోడుగా నైరుతి రుతుపవనాలు
సంగారెడ్డి, జూలై 10 : సంగారెడ్డి జిల్లాలో సరాసరి వర్షపాతం 4.4సెంటీ మీటర్ల నమోదైందని వాతావరణశాఖ అధికారులు ఆదివారం వివరాలు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా కల్హేర్ మండలంలో 66.8మిల్లీ మీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా సదాశివపేట మండలంలో 29.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండాలాల్లో వర్షం కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమై వరదల నుంచి తట్టుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. అల్పపీడానికి తోడుగా నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో విస్తారంగా వానలు పడటంతో అన్నదాతల్లో సంతోషం నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి పరిసరా ప్రాంతాల్లో కురుస్తున్న వానకు వాగులు, వంకలతో పాటు కొన్ని చోట్ల చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలోని పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతూ మత్తడులు దుంకేందుకు వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ముసురు వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసురుతో పాటు చల్లటి గాలులు తోడవ్వడం, సెలవు కావడంతో పట్టణ వాసులు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
అలుగు పారుతున్న మహబూబ్‌సాగర్
సంగారెడ్డి, జూలై 10: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువు అలుగు పోస్తున్నది. ఆదివారం తహసీల్దార్ స్వామి చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలో గంగకత్వ వాగు ఇప్పటికే అలు గు పారుతూ సందర్శకులను ఆకట్టుకున్నది. మరో మూడు రోజుల పాటు వర్షం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. పట్టణ వాసులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు చెరువు దగ్గరకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
ప్రవహిస్తున్న హల్దీ వాగు
వెల్దుర్తి, జూలై 10: కురుస్తున్న వర్షాలతో మండలంలోని హల్దీవాగులో ప్రవాహం ప్రారంభమైంది. వెల్దుర్తి మండలంతో పాటు చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల నుంచి, వ్యవసాయ పొలాల నుంచి వస్తున్న వరద నీరు తో ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద హల్దీవాగు ప్రవహిస్తున్నది. మండలంలోని చెరువులు, కుంటల్లోని భారీగా వరద నీరు చేరుతుండటంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.
నిండిన నల్లవాగు ప్రాజెక్టు
సిర్గాపూర్, జూలై 10: సంగారెడ్డి జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు జలాశయం నిండింది. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులోని 1493అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకున్నది. ప్రాజెక్టులోని 2852 క్యూసెక్కుల వరద వచ్చినట్లు ఏఈ సూర్యకాంత్ తెలిపారు. ఆయకట్టు కింద 6060 ఎకరాల ఆయకట్టుకు వానకాలం వరి పంటల సాగు సేద్యానికి సరిపడే వరద నీరు చేరాడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
దిగువకు నీరు విడుదల
నల్లవాగు ప్రాజెక్టు కింద సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని 8 చెరువులు నింపేందుకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచన మేరకు ఈఈ బీమ్, డీఈఈ పవన్‌కుమార్, ఏఈఈలు సూర్యకాంత్, రవి, దిలిప్‌లు దిగువకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. కూడి కాల్వ ద్వారా 70క్యూసెక్కులు, ఎడమ కాల్వ కింద 20 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. అలుగ ద్వారా 532 క్యూ సెక్కుల నీరు బయటకు వెలుతున్నది. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్‌గౌడ్, సిబ్బంది సంగమేశ్ ఉన్నారు.
పుల్కల్, జూలై 10 : భారీగా కురుస్తున్న వానలకు సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో సింగూరులోకి నీరు భారీగా వచ్చి చేరుతున్నట్లు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా వట్పల్లిలో 54మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా, పుల్కల్లో 51మి.మీ, మునిపల్లిలో 44.5మి.మీ, మనూర్లో 45మి.మీ, న్యాల్కల్ 44.3 మి.మీ, నాగల్గిద్ద 44.8మి.మీ, ఝరాసంఘం 49.3 మి.మీ, రాయికోడ్‌లో 46మి.మీ వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.772 టీఎంసీలు, ఇన్ ఫ్లో 4578 క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో 400 క్యూ సెక్కు లు కొనసాగుతున్నట్లు డిప్యూటీ డీఈ తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 1.592 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు.
పొంగిపొర్లుతున్న పోచారం
హవేళీఘనపూర్, జూలై 10: మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యాం నిండి ప్రవహిస్తోంది. మండలంలోని గంగమ్మవాగుతో పాటు ఇతర వాగుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో డ్యాంలోకి నీరు వచ్చి చేరుతున్నది. పోచారం అందాలను చూసేందుకు జిల్లాలోని నలుమూలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అధికంగా నీరు ప్రవహిస్తుండటంతో పోచారం డ్యాం పరిసరాల్లోకి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిఇస్తున్నారు.