గజ్వేల్, జూలై 10 : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ ప్రాంత దశ మారిందని, అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చూస్తే జాలేస్తున్నదని, హుజూరాబాద్‌లో ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని, ఇక ఆటలు సాగవని తెలుసుకున్న ఆయన గజ్వేల్ వైపు చూస్తున్నట్లు ఆరోపించారు. దమ్ముంటే మరోసారి హుజూరాబాద్‌లో గెలిచి ఉనికి చాటుకోవాలని సవాల్ విసిరారు. గజ్వేల్‌లో మోదీ, అమిత్‌షా, నడ్డా వచ్చినా ఈటలకు ఓటమి తప్పదన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్యం కలిగిన వారని, అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్ వెంటే ఇక్కడి ప్రజలు ఉంటారని అన్నారు.
టీఆర్ఎస్ కండువా వేసుకున్న ఒక సామాన్య కార్యకర్తను కూడా నువ్వు ఓడించగలవా అని ఈటల రాజేందర్‌ను వంటేరు ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీ పంచన చేరి డ్రామాలు ఆడుతున్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధుల గురించి ఒక్కసారి ప్రజలకు వెల్లడించాలని ప్రశ్నించారు. కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఈటల, ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి మతతత్వ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. పేదల భూములు కొల్లగొడుతున్న ఈటల రాజేందర్ ఏ ముఖం పెట్టుకుని గజ్వేల్‌లో అడుగు పెడతారని ప్రశ్నించారు.
గజ్వేల్ ప్రజల దేవుడుగా సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో నిలిచిపోయారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గండికొడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొనే చేతకాని కేంద్ర సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు కులమతాల పేరిట దేశంలో చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోదీ పేదలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన సభలో సొంత డబ్బా కొట్టుకోవడానికే పరిమితం అయ్యిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సమావేశంలో ఎంపీపీలు అమరావతి, పాండుగౌడ్, ర్యాగళ్ల సుగుణ దుర్గయ్య, జడ్పీటీసీలు మల్లేశం, మంగమ్మ రాంచంద్రం, బాలూయాదవ్, జయమ్మ అర్జున్‌గౌడ్, వైస్ ఎంపీపీలు దేవీ రవీందర్, బెల్దె కృష్ణాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, జగదేవ్‌పూర్ ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు శ్రీనివాస్,బాబుల్‌రెడ్డి, సతీశ్‌చారి, నూనెకుమార్, వెంకట్‌రెడ్డి, నాగరాజు, బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపరేందర్రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు రహీం, ఉప్పల మెట్టయ్య, నాయకులు దుర్గాప్రసాద్, గుంటుకు రాజు, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహదేవ్ గౌడ్, ఉపాధి హామీ రాష్ట్ర కమిటీ డైరెక్టర్ కోల సద్గుణ తదితరులు పాల్గొన్నారు.