
అందోల్, డిసెంబర్ 21: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణ శివారు నుంచి నాలుగులైన్ల రహదారి నిర్మాణం జరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పడడం, నిర్మాణాలు పెరుగుతుండడంతో మొరంకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ భూముల్లో గుట్టలకు గుట్టలు తవ్వేస్తూ కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ఒకవైపు రహదారి నిర్మాణంకోసం సంబందిత వ్యక్తులు మొరం తీసుకెళ్తుండగా, ఇదే అదనుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా మొరం తరలిస్తున్నారు. కాగా, రోడ్డు నిర్మాణానికే మొరం తీసుళ్తున్నట్లు భావిస్తున్న స్థానికులు ఎవరూ అడ్డుచెప్పడంలేదు. దీంతో, రాత్రిపగలు తేడాలేకుండా మండలంలోని తిరుమలయ్యగుట్టను పూర్తిగా కరిగించేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో అక్కడ పగటి పూట వీఆర్ఏలను కాపలా ఉంచారు. కానీ, అక్రమార్కులు రాత్రి సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా మొరం తరలిస్తుం డడంతో రాత్రి సమయంలో నూ అక్కడ వీఆర్ఏలను కాపలా పెట్టి మొరం తరలించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే విషయంలో విధులు సక్రమంగా నిర్వర్తించని ఆరుగురు వీఆర్ఏలకు మెమోలు సైతం జారీ చేశారు.
మొరం తరలించే వారిపై చర్యలు : అశోక్‌కుమార్, తహసీల్దార్
మండలంలోని తిరుమలయ్య గుట్ట ప్రాంతం ఉన్న ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడ మా సిబ్బందిని కాపలా ఉంచాం. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు వీఆర్ఏలకు మెమోలు కూడా జారీ చేశాం. ప్రస్తుతం అక్కడ పగలూ, రాత్రి వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములోనుంచి మొరం తరలించే వారెవరైనాసరే చర్యలు తీసుకుంటాం.