
చేర్యాల, డిసెంబర్ 17 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 26 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాది వరకూ కొనసాగనున్న సందర్భంగా కొమురవెల్లి ఆలయంలో శుక్రవారం ఆలయ చైర్మన్ భిక్షపతి అధ్యక్షతన ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో బ్రహోత్మవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో పాటు జిల్లా, డివిజన్, మండల స్థ్ధాయి అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ పోలీసు, విద్యుత్, గ్రామీణ నీటి పారుదల, వైద్య మరియు ఆరోగ్య శాఖ, టీఎస్ ఆర్టీసీ, గ్రామ పంచాయతీ, రోడ్లు మరియు భవనాల శాఖ, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, అగ్నిమాపక, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భక్తులకు కావాల్సిన వసతులు, ఏర్పాట్లు, శాఖపరంగా అధికారులు చేపట్టే కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం క్షేత్రంలో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ అధికారులు వేములవాడ క్షేత్రం నుంచి కొమురవెల్లి మీదుగా యాదగిరిగుట్టకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సులు, సోమ, మంగళ వారాల్లో కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ ఆలయాలకు బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. రాజీవ్ రహదారిలో స్వాగత తోరణాల వద్ద పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులకు వైద్య సేవలకోసం వైద్య శిబిరాలు, మందులు నిల్వ చేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. కరోనా నివారణ టీకాలు రెండు డోసులు వేసుకొని, మాస్కులు ధరించిన వారికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఎగ్జిట్ గేట్(వెనుక ద్వారం) నుంచి స్వామి వారి దర్శనం కోసం వెళ్లకుండా, మహామండపం పట్నాలు వేసిన వారు ఆలయంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి క్షేత్రానికి వచ్చే ఆర్అండ్బీ, పీఆర్ రహదారుల పై గుంతలు పూడ్చాలన్నారు. స్వామివారి కల్యాణం, బ్రహ్మోత్సవాల వివరాలతో పొందుపర్చిన వాల్‌పోస్టర్, స్వామివారి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడారు. మల్లన్న దర్శనం కోసం వచ్చిన భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, అడిషనల్ డీపీవో కౌసల్యదేవి, హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్, సివిల్, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, మహేంద్రకుమార్, ఎస్సైలు చంద్రమోహన్, నరేందర్‌రెడ్డి, మల్లన్న ఆలయ ధర్మకర్తలు, ఆర్టీసీ, విద్యుత్, అర్అండ్బీ, పీఆర్, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే..
స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నామని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. స్వామివారి క్షేత్రం రానున్న రోజుల్లో మరింత అభవృద్ధి సాధిస్తుందన్నారు. అప్పటి ప్రభుత్వాలు 60 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో 50 కాటేజీల నిర్మాణం, రూ.2కోట్ల70లక్షలతో మహామండప విస్తరణ పనులు, గణపతి ఆలయం, స్వామి వారికి నివేదన శాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. వైశ్య సత్రం ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ఇటీవలే ప్రారంభించామన్నారు.