
చేర్యాల టౌన్, డిసెంబర్ 13: భగవద్గీత… సుమారు 5150 సంవత్సరాల క్రితం ద్వాపర యుగాంతంలో జగద్గురువైన శ్రీకృష్ణుడి నుంచి జాలువారిన గానామృతం. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు శిష్యుడు సఖుడు అయిన అర్జునుడికి కురుక్షేత్రంలోని యుద్ధరంగంలో దిశానిర్దేశం చేసిన పవిత్ర బోధ. తన గురువైన వేదవ్యాసుడి అనుగ్రహంతో పొందిన అద్వితీయశక్తితో సంజయుడు, అర్జునుడి రథం పైనున్న ఆంజనేయుడు, సమీప పర్వతశిఖరం పైనుంచి ఘటోత్కచుడి కుమారుడైన బర్బరీకుడు భగవద్గీతను నేరుగా విన్నారని శాస్ర్తోక్తి. వాగ్రూపదేవతగా ఇతిహాసికులు అభివర్ణించే భగవద్గీత నేటి యువతరానికి సైతం జీవన మార్గదర్శిగా పరిగణింపబడుతోంది.
ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో భగవద్గీత రచింపబడినట్టుగా ఈ నాటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మహాభారతంలోని భీష్మపర్వంలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో యుద్ధరంగంలో అర్జునుడికి ఉపదేశింపబడినదిగా సమాచారం. ప్రస్తుత ప్రపంచానికి నిత్య పారాయణ గ్రంథంగా అవతరించింది. ఆదిశంకరుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, అరబిందుడు, మహాత్మాగాంధీ, ఐన్‌స్టీన్, అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తర్వాతి తరాలు ఆదరించవలసిన గ్రంథంగా వారు కొనియాడబడింది.
ధర్మం, ఫలితం అనే మూలసూత్రాలతో..
సమాజంలో ధర్మం ఆవశ్యకత, ఫలితం ఆశించకుండా పనిచేయాలనే మూలసూత్రాల ఆధారంగా ‘గీత’ చెప్పబడిందన్నది పురాణకారుల అభిప్రాయం. ప్రస్తుత తరానికి అవసరమైన బిజినెస్ ట్రిక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచే అనేక మంది ఉపన్యాసకులు నేడు గీత భావాన్ని ఆధారం చేసుకుంటున్నారు. సంస్కృత రచనగా ఉన్న ఈ గ్రంథం, సుమారు 75 భాషల్లోకి అనువదించబడింది. ఒక్క ఇంగ్లిష్‌లోకి 300 సార్లు తర్జుమా చేయబడింది. 1785లో ఛార్లెస్ విల్కిన్ మొదటిసారి ఆంగ్లంలోకి అనువదించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు గంగాధరశాస్త్రి భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను గానం చేసి ప్రఖ్యాతి పొందారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రామకృష్ణమఠం భగవద్గీతను రమ్యంగా అచ్చువేసి అతితక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. ఆదిశంకరుడు, రామానుజులు, చైతన్య మహాప్రభు వంటి ప్రాచీన ఆధ్యాత్మిక వేత్తలు ఈ గ్రంథానికి భాష్య రచన చేసి సామాన్య జనానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికీ అనేక దేవాలయాల్లో భగవద్గీత జయంతి సందర్భంగా సామూహిక గీత పారాయణం, హోమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహింపబడుతున్నాయి.
దైవత్వానికి దారిచూపే భగవద్గీత..
నుదుటి గీతను సైతం మార్చగల శక్తి భగవద్గీత సొంతం. సంసారం ఒక యుద్ధ రంగమైతే మనిషి అర్జునుడు. ప్రస్తుత సమాజంలో మనిషి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సరైన సమాధానం భగవద్గీతలో దొరుకుతున్నది. చేయవలసిన, చేయకూడని పనులపై స్పష్టతనివ్వడంలో గీతను మించిన మరొక గ్రంథం లేదు. భగవద్గీత పుట్టింది మార్గశిర మాసంలో. అందుకే కృష్ణ పరమాత్మ తనను తాను మార్గశిర మాసంగా గీతలో చెప్పుకున్నాడు. మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపే చుక్కాని గీత. అహంకార మమకారాలను దూరం చేసి లౌకిక విషయాలపై వైరాగ్యాన్ని కలిగి ఉండడమే భగవద్గీత సారాంశం.
సమాధాన సమాహారం..
భగవద్గీతను పాఠశాల స్థాయిలోనే పిల్లలకు అవపోసన పట్టియ్యాలి. తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్టుగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగంతో పాటు నిత్యజీవితంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన బలాన్ని భగవద్గీత అందజేస్తున్నది. మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన సమాధానాలు అందించే అద్భుత సమాచార గ్రంథం.
భగవద్గీత భావవ్యాప్తే ప్రధాన లక్ష్యం..
36 ఏండ్లుగా భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గీత ప్రబోధాన్ని పలువురికి పంచాలన్న సదుద్దేశంతో అప్పటి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గడ్డమణుగు మోహన్‌రావు చొరవతో ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రారంభం కాగా, ఈ నాటికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. సుమారు మూడు దశాబ్దాల పాటు ప్రతి ఆదివారం సాయంత్రం కోరుకున్న సభ్యుడి ఇంట్లో గీత పారాయణం, ప్రవచనం, భజనలు నిర్వహించాం. గీత జయంతి సందర్భంగా ప్రతిసంవత్సరం విద్యార్థులు, యువకులు, వయోజనులకు మూడు విభాగాలుగా పఠన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నాం.