అల్లాదుర్గం, జూలై 1 :తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్నివర్గాల వారు భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి. బోనాల పండుగకు ప్రపంచ వ్యాప్తంగా పేరున్నది. ఈ పండుగ సీజన్లో పల్లెల్లో బంధువులతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో ఆషాడమాసం తొలి ఆదివారం నిర్వహించే మొట్టమొదటి బోనాలతో తెలంగాణలో పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి.
బోనం సమర్పణ
బోనం అంటే భోజనం. ప్రజలు గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త కుండలో వండిన బోనం సమర్పించడం ఆనవాయితీ. చిన్న ముం తలో తయారుచేసిన పానకం సాకగా పోస్తారు. ముంతపై దివ్వె పెట్టి బోనం జ్యోతిని వెలిగిస్తారు. ఆ బోనాలను మహిళలు నెత్తి ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఊరేగింపుగా వెళ్లే సమయంలో బోనాలన్నీ వరుసగా వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. చీకటి పడే సమయంలో బోనాల జ్యోతు లు వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పండుగ రోజున మహిళలు తలస్నా నం ఆచరించి, మడితో బోనం ఆహారం తయారు చేస్తారు. ఒక పాత్రలో అన్నం వండి, ఇతర వంటకాలు, ప్రసాదాలు తయారు చేస్తారు. పూర్తిస్థాయిలో బోనం తయారు చేస్తారు. ఊరేగింపు గా తీసుకువెళ్లే ముందు మూడు అంతస్తులుగా ఏర్పాటు చేస్తారు. కింద భాగంలో ఉండే పెద్ద పాత్రలో అన్నం, పెరుగు, బెల్లం, దానిపైన రెండో పాత్రలో పులుసు, దానిపై పత్తితో తయారుచేసిన ఒత్తిని వేసి మంచినూనెతో వెలిగించి ఆలయానికి వెళ్లేంత వరకు దీపం ఉండేలా శ్రద్ధ్ద తీసుకుంటారు. ఈ బోనాలను వేప ఆకులు, పసుపు, కుంకుమతో అందంగా అలంకరిస్తారు. వివాహం కాని యువతులు బోనం ఎత్తుకుంటే వివాహం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. బోనాల ఊరేగింపులో శివసత్తులు ముఖానికి పసుపు రాసుకొని అమ్మవారిని స్తుతిస్తూ పూనకంతో ఊగిపోతారు. ఇలా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
తొట్టెల ఊరేగింపు
బోనాల పండుగ ఊరేగింపులో మరో ఆకర్షణీయమైన ఘట్టం తొట్టెల ఊరేగింపు. పలుచటి రంగుల కాగితాలతో ఐదు అంతస్తుల భవనంలా తయారుచేసి అమ్మవారికి సమర్పించడమే తొట్టెల అని పిలుస్తారు. తొట్టెల సమర్పించే భక్తులు ఇల్లు లేనివారు తొట్టెల సమర్పించుకోవడంతో ఇల్లు నిర్మించుకునేలా చూడు తల్లి అని వేడుకోవడం అని, ఇల్లు ఉన్నవారు ఈ తొట్టెలను సమర్పించి త మ ఇల్లు సుభిక్షంగా ఉం డేలా ఆశీర్వదించమని కోరుకుంటారు. తొట్టెలను తయా రు చేసి ఆల యం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారికి సమర్పించి ఆలయ పరిసరాల్లోనే తొట్టెలను ఉంచుతారు.
పోతరాజుల విన్యాసాలు
ఇక అమ్మవారి సోదరుడే పోతరాజు అని చెప్పుకుంటారు. ఒంటినిండా పసుపు రాసుకొని, నుదిటిపై పెద్దసైజులో కుంకుమ బొట్టు పెట్టుకుని, నడుముకు వేపాకులు, మువ్వలు చుట్టుకుని.. కాలికి గజ్జెలు కట్టుకుని, చిన్న ఎర్ర ని దోతిని ధరించి పెద్ద పెద్ద మీసాలతో, చేతిలో చెర్నకోల పట్టుకొని ఉత్సవాల్లో ఆకర్షణతో ఉత్సవమూర్తిలా కనిపిస్తుంటారు. బోనాల ఉత్సవాల ప్రా రంభ సమయంలో నిమ్మకాయలు కోసి నాలుగు వైపులా చల్లుతూ అమ్మవారి ఊరేగింపులో సందడి చేస్తుంటారు. బోనాలు, అమ్మవారి ఊరేగింపు ఆరంభకుడిగా పోతరాజును చెప్పుకోవచ్చు. పోతరాజు వేషం ధరించే వ్యక్తి చక్కటి శరీర సౌష్ఠవం, మంచి బలశాలిగా ఉంటారు. బోనాల పండుగలో పోతరాజులు డప్పు చప్పుడుకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, చేతిలోని చెర్నకోలను తిప్పుతూ ముందుండి ఉత్సవాలను కొనసాగిస్తారు. చెర్నకోలను ఝుళిపిస్తూ లయబద్ధ్దంగా నృత్యం చేస్తూ బోనాల ఊరేగింపులో ప్రత్యేకతను పోతరాజులు సంతరించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెపోట్టెళ్లను సైతం అలంకరించి వాటికి చిన్నపాటి బండ్లు కట్టి ఫలహారం బండిగా ఊరేగింపు చేపడుతారు.