మెదక్ అర్బన్, జూన్ 29: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలను ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ అదనపు ఎస్పీ డా.బి.బాలస్వామి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, సఖీ సెంటర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆపరేషన్ ముస్కాన్-8 నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్-8 జూలై 1 నుంచి 31 వరకు నిర్వహిస్తామన్నారు.
18 ఏండ్ల లోపు బాలబాలికలు ఎక్కడైనా పని చేస్తున్నట్లుగా గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోంకు పంపించాలన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ఒక ఎస్సై, ముగ్గురు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. బాలకార్మికులుగా పట్టుకున్న పిల్లలను స్టేట్ హోంకు పంపించే ముందు జిల్లా మెడికల్ అధికారులతో కరోనా టెస్ట్ చేయించాలన్నారు. అధికారులు అందరూ కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా దుకాణాల్లో పనులు చేస్తున్న వీధి బాలలను చూసినప్పుడు 1098 లేదా డయల్ 100, 112కు చూసినప్పుడు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సమావేశంలో డీఈవో రమేశ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా డీసీఆర్బీడీఎస్పీ నారాయణరెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు, ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫీసర్ బ్రహ్మాజీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.