వట్పల్లి, జూన్ 11: గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని నిర్జప్ల, నాగులపల్లి, ఉసిరికపల్లి, షాద్‌నగర్, గౌతాపూర్, దరఖస్తుపల్లి, పాలడుగులో శనివారం నిర్వహించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్జప్ల, నాగులపల్లి గ్రామాల్లో విలేజ్ పార్కు, క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. నిర్జప్లలో మినీ ఫంక్షన్ హాల్, వివిధ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్జప్ల గ్రామాభివృద్ధికి రూ.84 లక్షలు, నూతన పాఠశాల భవన నిర్మాణానికి రూ.68 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే మారుమూల పల్లెలు సైతం పట్టణాలను తలపించే అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ ఆపర్ణ, మండల ప్రత్యేక అధికారి గీత, ఎంపీడీవో జగదీశ్వర్, సర్పంచ్ నందినీవీరారెడ్డి, ఎంపీవో యూసూఫ్, రైతుబంధు అధ్యక్షుడు అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వినోద్‌గౌడ్, వైస్ ఎంపీపీ నాగరాణి బస్వరాజ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సురేఖాబుద్ధిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివాజీరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.