ఒక చిత్రం ప్రగతిని తెలియజేస్తున్నది. ఒక ఆలోచన అభివృద్ధి వైపు నడిపిస్తున్నది. దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ పథకాలు అందరికీ తెలియజేయాలని నారాయణరావుపేట మండలం మాటిండ్ల సర్పంచ్ నారాయణ వినూత్నంగా ఆలోచించాడు. గ్రామంలోని కల్వర్టు గోడలపై సంక్షేమ పథకాల చిత్రాలు గీయించాడు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, కేసీఆర్ కిట్ చిత్రాలు గీయించడంతో అటుగా వెళ్లేవారు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. సంక్షేమ పథకాల చిత్రాలను చూసి మాటిండ్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం, పచ్చదనం వంటి అంశాల్లో ఈ గ్రామం ముందున్నది.
నారాయణరావుపేట, మే, 29 : రాష్ర్టానికే కాదు దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ పథకాలు ప్రజలందరికీ తెలియాలని ఓ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించి గ్రామంలోని కల్వర్టుగోడలపై సంక్షేమ పథకాల చిత్రాలు గీయించాడు. సిరిసిల్లకు వెళ్లే రహదారిపై ఈ చిత్రాలు గీయించడంతో అటుగా వెళ్లేవారు వాటిని ఆసక్తిగాచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నందునే గోడలపై ఆకర్షణీయంగా చిత్రాలు గీయించినట్లు మాటిండ్ల సర్పంచ్ కొంగరి నారాయణ తెలిపారు.
గోడలపై పలు సంక్షేమ పథకాల చిత్రాలు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, కేసీఆర్ కిట్‌తో పాటు వివిధ రకాల చిత్రాలు గ్రామంలోని వీధుల్లోనే కాకుండా మాటిండ్ల నుంచి గోపులాపూరం వెళ్లే రోడ్డు మార్గంలోని కల్వర్టులపై చిత్రీకరించారు. అటుగా వెళ్లే వాహనదారులను ఆచిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. సర్పంచ్ చొరవతో హరితహారం చెట్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం ప్రహరీ, గేట్లకు రంగులు వేయించారు. సర్పంచ్ చొరవతో డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతివనం, నర్సరీ, వైకుంఠధామం ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామస్తులు సంక్షేమ పథకాల చిత్రాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సొంత ఖర్చుతో వేయించా..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామస్తులకు అర్థమయ్యే విధంగా వివిధ రకాల చిత్రాలను సొంత ఖర్చుతో వేయించా. మా గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– కొంగరి నారాయణ, మాటిండ్ల సర్పంచ్