
కోహీర్, నవంబర్ 14: అరటి సాగుతో రైతన్నలకు అధిక ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో వారు మరింత ఆసక్తితో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి, మాచిరెడ్డిపల్లి, బిలాల్పూర్, పైడిగుమ్మల్, పీచెర్యాగడి, తదితర గ్రామాల్లో రైతులు అరటి తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మొలకలను పొలంలో నాటుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో మొలకను నాటేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముందుగా దుక్కి చేసుకొని ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఒక్కో మొలకను నాటాలి. సేంద్రియ ఎరువులను వినియోగించి డ్రిప్, కాల్వల ద్వారా సాగునీటిని అందించాలి. ఎస్-1, జీ-9, రిలయన్స్ తదితర రకా ల మొలకలను ఎకరానికి 12 నుంచి పదమూడు వందలు వేసుకోవచ్చు. నాటిన సంవత్సరానికి కాయలు కోత దశకు వస్తాయి. గెలలను సేకరించి మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. ఒక్కో గెల 30 నుంచి 35కిలోలు ఉంటుంది. ఎకరానికి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దున్న డం, కూలీలు, ఎరువులు, గెలలు మార్కెట్‌కు తరలింపు, తదితర ఖర్చులను తీసేస్తే ఎకరానికి లక్ష రూపాయలకు పైగా మిగులుతుంది. మొత్తానికి వరి సాగు కంటే అరటి తోటల సాగుతో రైతన్నలకు అధిక ఆదాయం లభిస్తున్నది.
రెండో పంటకు ఖర్చు తక్కువ
అరటి తోట సాగుకు తొలి సారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది. రెండో సారి ఎక్కువగా ఉండదు. పొలంలో నాటిన మొలక పెద్దగా ఎదిగి 12 నెలలకు కాయలు కోతకు వస్తాయి. 15 నెలల్లో పొలంలో ఉన్న అరటి గెలలను పూర్తిగా తొలిగించాలి. కాండం వద్ద నుంచి మరో ఐదు నుంచి ఆరు మొలకలు వస్తాయి. అందులో ఒకటి మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. మొదటి సారి పంట సాగు చేసేందుకు విత్తనం రూపంలో దుంప, మొలక అవసరమవుతుంది. కానీ రెండో సారి మాత్రం పొలంలోనే చాలా లభిస్తాయి. దీంతో రైతన్నలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది.
మూడు ఎకరాల్లో తోట..
నేను మూడు ఎకరాల్లో అరటి తోటను వేశా. ఇప్పటికి చాలా సార్లు పండించాను. పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయినా కూడా రైతులకు నష్టం మాత్రం రాదు. అరటి గెలలు కొనే వ్యాపారులు మాత్రం కోత సమయంలో తొందరగా తీసుకువెళ్లకుండా సతాయిస్తరు. అరటిని పండించడంతో ఎకరానికి లక్ష రూపాయలకు పైగా మిగులుతుంది. – బాబా, కవేలి రైతు
అంతర పంటగా అరటి..
రైతులు అధిక లాభాలు పొందాలంటే అల్లం పంటలో అరటి తోటలను అంతర పంటగా సాగు చేయవచ్చు. అల్లం పంటకు గిట్టుబాటు లేకపోయినా రైతులకు ఎలాంటి నష్టం జరుగదు. ధర తక్కువగా ఉంటే అల్లం పంటను తొలగించి అరటి సాగుపై దృష్టి పెట్టాలి. అరటి కాయలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
-నవీన్‌కుమార్, కోహీర్ మండల వ్యవసాయాధికారి