అల్లాదుర్గం, మే 17 : హరితహారం, బృహత్ ప్రకృతి వనం నిర్వాహణలో మండల పరిషత్ అధికారుల పనితీరు ఏమాత్రం బాగాలేకపోడంపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని చిల్వెర, కాయిదంపల్లి, అల్లాదుర్గం గ్రామాల్లో ఆమె పర్యటించారు. కాయిదంపల్లిలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఇందులో పదివేల మొక్కలు నాటాల్సి ఉండగా మూడు వేల మొక్కలు కూడా నాటకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. హరితహారం, బృహత్ ప్రకృతి వనం నిర్వహణలో అల్లాదుర్గం మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, ఎన్నిమార్లు హెచ్చరించినా అధికారుల పని తీరులో మార్పు రాలేదని, పని చేతకాకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డిపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాటా ఎంట్రీ పనులు వేగవంతం చేయాలి
డాటా ఎంట్రీ పనులను వేగవంతం చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. కాయిదంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం వివరాలను వెంటనే డాటా ఎం ట్రీ చేస్తే రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అవుతాయన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం..
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన అల్లాదుర్గంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, కాయిదంపల్లి పాఠశాలను తనిఖీ చేశారు. ‘మనఊరు-మన బడి’లో భాగంగా ఎంపికైన పాఠశాలల్లో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణాలు, విద్యుత్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీవో సయ్యద్, సర్పంచ్‌లు అంజియాదవ్, బేతయ్య, ఏపీఎం నాగరాజు తదితరులు ఉన్నారు.