సంగారెడ్డి కలెక్టరేట్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో సమావేశమైన వీరారెడ్డి వానకాలం 2022 సాగుకు సమాయత్తం, నకిలీ విత్తనాలు, కల్తీ మందులను అరికట్టడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను నకిలీ విత్తనాలు, కల్తీ మందులు లేని జిల్లాగా రూపొందించాలని పిలుపునిచ్చారు. వానకాలం యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నకి లీ విత్తనాలు, కల్తీ ఎరువులు, మందుల అమ్మకాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రైతులకు కల్తీ లేకుం డా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్ పేరిట అమ్మే అవకాశం ఉన్నదన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి విషయాలను వెంటనే సంబంధిత స్థానిక వ్యవసాయ శాఖ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్కు తెలియజేస్తే అరికట్టేందుకు వీలవుతుందన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా అవగాహన కల్పించాలన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు వేసి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.
జిల్లాలో విజిలెన్స్ కమిటీల ఏర్పాటు
మండల, డివిజన్, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామని వీరారెడ్డి అన్నారు. ఆయా కమిటీల్లోని అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని వివరించారు. డీలర్లు రైతులు అడిగిన ఎరువులు, విత్తనాలను మాత్రమే ఇవ్వాలని, ఇతరాత్ర రకాలు అంటగట్టవద్దని హితవు చే శారు. జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగు మందు అమ్మకాలు జరగరాదన్నారు. రోజువారీ అమ్మకాల వివరాలను అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీలర్లు వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు. ఆయా దుకాణాలకు లైసెన్స్‌లు విధిగా ఉండాలని, ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులో వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఏఈవోలు ఈ నెల 15 నుంచి లైసెన్స్ ఉన్న ప్రతి విత్తన దుకాణ నుంచి శాం పిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపాలన్నారు. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా విజిలెన్స్ కమిటీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా బయో ఫర్టిలైజర్స్ అమ్మే వారిపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో వర్షాకాలం సాగుకు అవసరమైన ఎరువులు, ఫర్టిలైజర్స్‌కు కొరత లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలను అధికారులను కోరారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తే అధిక దిగుబడులు వచ్చి రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందులు పరిమితికి మించి వాడకూడదని రైతులకు సూచించారు. పక్క రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు, కల్తీ మందులు వచ్చే అవకాశం ఉన్నదని, చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిఘా పెంచాలన్నారు. ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు.
నకిలీ విత్తనాలు, మందులు అమ్మిన వారిపై చర్యలు చేపట్టడంతో పాటు ఆ విషయాన్ని సోషల్ మీడియా, పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. అంతకుముందు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వచ్చే వానకాలం సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సమాయాత్తం అయ్యేందుకు ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలకు శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు. సమావేశంలో డీఎస్పీ బాలాజీ, జిల్లా ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి కరుణాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఏం శ్రీదేవి, ఏడీఏలు, మండల వ్యవసాయశాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈవోలు, డీలర్లు పాల్గొన్నారు.