గుమ్మడిదల, మే 4: సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. స్వయంభు వీరభద్రస్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి మూలవిరాట్టు చుట్టూ రాజగోపురాలు, సాలారాలు, ప్రాకారాలు నిర్మించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు శిఖర కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను బర్ధీపూర్ ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్యశిఖామణి అవధూతగిరి మహారాజ్, తంగడ్వల్లి ఆశ్రమ పీఠాధిపతి 108 గురుగంగాధర శివయోగి శిచార్యస్వామి ఆధ్వర్యంలో నిర్వహించానున్నారు.
వీరభద్రస్వామి వారి ఆలయం నూతన శోభ సంతరించుకున్నది. నలుదిక్కులు రాజగోపురాలు, నిత్యకల్యాణ మండపం, కోనేరు, భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి అద్దాలమేడ, నిత్యాన్నదాన సత్రం, భక్తులకు సత్రాలు, ఆలయ ప్రాంగణంలో చలువరాతితో నిర్మాణాలతో భక్తులకు మనస్సు పులకరించేలా రూపుదిద్దుకున్నది. సుమారు రూ.4 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయకమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌గుప్తా, ధర్మకర్తలు, వీరన్నగూడెం, బొంతపల్లి పంచాయతీ పాలకవర్గం కృషితో స్వామికి కొత్త అందాలు తీసుకువచ్చారు.
భక్తుల కొంగుబంగారం వెలుగొందుతున్న వీరభద్రస్వామివారి దేవాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, భక్తులందరి సహకారం, కృషితో అపురూపంగా తీర్చిదిద్దాం. సాలారాలు, ప్రాకారాలు పూర్తి చేశాం. నిత్యకల్యాణ మండపం, కోనేరు, యజ్ఞశాల, అద్దాల మేడ నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. రాజగోపురాలకు శిఖర, యంత్ర ప్రతిష్ఠలను ఆశ్రమ పీఠాధిపతులతో నిర్వహించనున్నాం.
– గటాటి భద్రప్ప, వీరభద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్, బొంతపల్లి-వీరన్నగూడెం
శైవక్షేత్రాల్లో ఒక్కటైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దాం. ఇండోమెంట్ సహకారం, భక్తుల విరాళాలతో రాజగోపురాలు, సాలారాలు, ప్రాకారాలు నిర్మించాం. బర్ధీపూర్ ఆశ్రమ పీఠాధిపతి, గురుగంగాధర ఆశ్రమ పీఠాధిపతి యంత్ర, శిఖర ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించగలరు.
– యు.శశిధర్‌గుప్తా, ఈవో, వీరభద్రస్వామి దేవాలయం