హుస్నాబాద్, మే 3: రైతులు పండించిన వరిపంటను ఒకప్పుడు కూలీలను పెట్టి కోయించేవారు. ఎకరం పొలంలోని వరిపంటను కోయాలంటే ఎక్కువ మంది కూలీలతో పాటు ఎక్కువ రోజులు కూడా పట్టేది.. అనంతరం హార్వెస్టర్ అనే యంత్రం వచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. కూలీల కొరత సమస్య నుంచి బయటపడేసింది. ఆ తర్వాత హార్వెస్టర్ కోసిన వరి పంటలో వరిగడ్డి సేకరణ సమస్య రైతులను వేధించింది. వరిగడ్డిని సేకరించి ఒకచోట కుప్పవేసేందుకు కూడా మళ్లీ కూలీల అవసరం పడేది. దీంతో సమయం, ఖర్చు అధికమయ్యేవి. ఈ ఖర్చును భరించలేని రైతులు గడ్డిని మొత్తం కాల్చేసేవారు. లేదంటే ఎవరికైనా ఉచితంగా ఇచ్చేవారు. ఈ సమస్య నుంచి కూడా రైతులను బయటపడేసేందుకు ఒక కొత్త యంత్రం వచ్చింది. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా దీని సందడి కనిపిస్తోంది. అదే ‘గ్రాస్ బేలర్'(గడ్డి చుట్టే యంత్రం). ఈ యంత్రాలు గ్రామాల్లోని రైతులకు అండగా ఉంటున్నాయి. హార్వెస్టర్ ద్వారా కోసిన వరి పంట గడ్డిని చుట్టలు చుడుతూ రైతులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుతోంది.
రైతులకు ఎంతో ఉపయోగం..
గ్రాస్ బేలర్ యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొద్దిపాటి పెట్టుబడితో ఏండ్లపాటు ఉపయోగపడే ఈ యంత్రంతో గడ్డి సేకరణ సులువవుతుంది. గతంలో కూలీలను పెట్టి గడ్డిని కుప్పలుగా వేసి, ఆ తర్వాత మరో చోటుకు తీసుకెళ్లి గడ్డివాము పెట్టే వారు. దీనికి సమయం, డబ్బు వృథా అయ్యేది. కానీ, ఈ యంత్రం ద్వారా తయారైన గడ్డికట్టలను తరలించడం, కుప్పలుగా పెట్టడం ఎంతో సులువు. ఖర్చు కూడా తక్కువ అవుతున్నది. ముఖ్యంగా పాడి రైతులకు గడ్డి కొరత లేకుండా ఇది ఎంతో మేలు చేస్తుంది. రైతులు ఇలాంటి యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
– నాగరాజురెడ్డి, మండల వ్యవసాయాధికారి, హుస్నాబాద్
పశువులకు వరిగడ్డి పుష్కలంగా దొరుకుతున్నది..
హార్వెస్టర్లు వచ్చినంక వరిగడ్డి కరువైంది. వరి కోసినంక గడ్డిని ఒక్కదగ్గరెయ్యాలంటే పది మంది మనుషులు కావాలి. ఇది కష్టం కాబట్టి చాలామంది రైతులు వరిగడ్డికి నిప్పుపెట్టి కాల్చేసేవారు. దీంతో పశువులకు గడ్డి దొరికేదికాదు. గడ్డి చుట్టే మిషన్ వచ్చినంక పశువులకు వరిగడ్డి పుష్కలంగా దొరుకుతున్నది. కూలీల కోసం చూడకుండా మిషన్‌ను పెట్టి ఒక్క రోజులోనే గడ్డి మొత్తం కట్టలు కట్టి, కుప్పులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మిషన్లు వచ్చినంక రైతులకు ఎంతో లాభం ఉంటంది. బేలర్ మిషన్‌ను రైతులందరూ ఉపయోగించుకొని తమ పశువులను కాపాడుకోవాలి.
– దుర్గాని రాజయ్య, రైతు, మహ్మదాపూర్, హుస్నాబాద్ మండలం
గడ్డి సేకరణ కోసం అధిక ఖర్చు..
హార్వెస్టర్‌తో వరి కోసిన తర్వాత గడ్డి సేకరణకు రైతులు అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణంగా కూలీలతో కోసిన వరిగడ్డి పొడవుగా ఉండి, సేకరణ సులువుగా ఉంటుంది. కానీ, హార్వెస్టర్‌తో కోసిన గడ్డి చిన్నగా ఉంటుంది. సేకరించడం, తరలించడం కష్టంగా ఉంటుంది. ఎద్దులు, ఆవులు, గేదెలు ఉన్న రైతులు ఖర్చును కూడా భరించి, ఎక్కువ మంది కూలీలను పెట్టి గడ్డిని సేకరించి వాములు పెడుతారు. దీనికి ఎకరానికి సుమారు రూ.4వేల వరకు ఖర్చవుతుంది. మరికొందరు రైతులు గడ్డికి నిప్పంటించి పూర్తిగా కాల్చివేస్తారు. గడ్డిని కాల్చడంతో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కూలీల ఖర్చును తగ్గించి, పర్యావరణం దెబ్బతినకుండా బేలర్ యంత్రంతో గడ్డిని సేకరించి కట్టలుగా చేసి తరలించడం ఎంతో సులువని చెప్పొచ్చు. ఎకరానికి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రం మార్కెట్లో రూ.2.90లక్షల నుంచి రూ.3.20లక్షల వరకు దొరుకుతుంది. ఈ యంత్రంలో రెండు రకాలు ఉన్నాయి. గడ్డిని రౌండ్‌గా చుట్టేది.. చతురస్రాకారంలో చుట్టే యంత్రం ఉంటుంది.
బేలర్ యంత్రం ఉపయోగాలు..
గడ్డిని చుట్టలుగా చుట్టడంతో నిల్వ చేయడం ఎంతో సులువు.
గడ్డి కట్టలను ఒకచోటు నుంచి మరో చోటికి సులువుగా తరలించుకోవచ్చు.
అతి తక్కువ మంది కూలీలతో గడ్డి సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.
గడ్డిని కాల్చివేసే అవకాశం ఉండదు. పర్యావరణం దెబ్బతినదు. భూసారం తగ్గదు.
గడ్డి వృథా పోకుండా రైతులకు అదనపు ఆదాయంగా ఉంటుంది.
పశుగ్రాసం కొరత అనేది ఉండదు..
పాడి రైతులకు ఈ యంత్రం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.
కూలీల కొరతను రైతులు అధిగమించొచ్చు.
సొంత ట్రాక్టర్ ఉన్న రైతులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ యంత్రాన్ని నడుపుకోవచ్చు.
ఒక ఎకరం పొలంలో సుమారు 50కట్టలు వస్తాయి. దీంతో రైతులు గడ్డి కొరత ఉన్న ప్రాంతాలకు విక్రయించుకోవచ్చు.
అతి తక్కువ సమయంలో గడ్డిని సేకరించి గడ్డి బేళ్లను కుప్పలుగా వేసుకొని రెండో పంట సాగుకు సన్నద్ధం కావొచ్చు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఉపాధిని పొందవచ్చు.
‘బేలర్’ యంత్రం పనిచేసే విధానం..
సాధారణంగా రైతులు వినియోగించే ట్రాక్టర్‌కు బేలర్ యంత్రాన్ని అమర్చుతారు. ఇది ఆటో ఎలక్ట్రో హైడ్రాలిక్ సిస్టం కలిగి ఉంటుంది. పొలంలో అక్కడక్కడ పడి ఉన్న గడ్డిని పికప్ యూనిట్ ద్వారా తీసుకుంటుంది. యంత్రంలోని రోలర్ సహాయంతో గడ్డిని కట్టగా తయారు చేస్తుంది. కట్ట తయారయ్యాక, దారంతో కట్టను గట్టిగా కడుతుంది. కట్ట తయారయ్యే విధానం యంత్రంపై బిగించిన బేల్ ఇండికేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. కట్ట తయారు కాగానే, డ్రైవర్ దగ్గర ఏర్పాటు చేసిన కంట్రోల్ బాక్సులో లైట్ వెలుగుతుంది. తర్వాత కంట్రోల్ బాక్సులో ఉన్న బేల్ ఎజెక్షన్ స్విచ్ నొక్కి, డ్రైవర్ బేలర్ యంత్రంలోని గడ్డికట్టను బయటకు పంపుతాడు. బేలర్ యంత్రం చుట్టిన కట్టల సంఖ్యను బేల్ కంట్రోల్ బాక్సులో స్క్రీన్‌పై చూడొచ్చు.