సూర్యడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఎండలు మండిపోతుండడంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. వేసవిలో వ్యాధులు, వడదెబ్బకుగురి కాకుండా తగిన జాగత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆరేండ్ల లోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు.
దుబ్బాక టౌన్, మే 2 : వేసవిలో గరిష్టస్థాయికి పెరిగిన ఉష్ణోగ్రత్తల కారణంగా ప్రజలకు వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు తలెత్త్తే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో వేసవిలో వచ్చే వ్యాధులు ప్రాణాంతకం కూడా కావచ్చు. మెదడులోని ఉష్ణాన్ని నియంత్రించే వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో ఉష్ణ ఉత్పత్తి, విడుదల మధ్య సమతుల్యం లోపించి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఎండదెబ్బతో డీహైడ్రేషన్ అయ్యి గుండెపోటు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, వృద్ధులపై ప్రభా వం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్న రోగులు వేసవికాలంలో జాగ్రత్తతతో ఉండాలి. చిన్నపిల్లలు, గర్భిణులు వేసవిలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండాకాలం ప్రజలకు కష్టకాలమే..
ఎండ, వడ గాలులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తి వాంతులు విరేచనాలే కాకుండా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు, వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తరుచుగా నీరు తాగుతూ శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసు కోవాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. తీసుకుంటున్న ఆహారంలో నాన్వెజ్ లేకుండా చూసుకోవాలి. 104 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత పెరిగితే చల్లటి గుడ్డతో శరీరమంతా తుడిచి వైద్యుల సలహాల మేరకు చికిత్స అందించాలి.
– డాక్టర్.హేమ్రాజ్సింగ్, సూపరింటెండెంట్ (దుబ్బాక దవాఖాన)
వడదెబ్బ..
వేసవిలో వచ్చే వడదెబ్బ అతి ప్రమాదకరమైంది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పని చేయక పోవడం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్ హీట్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వడదెబ్బ వస్తుంది. దీనినే ఎండ దెబ్బ కూడా అని అంటారు.
లక్షణాలు…
రోగికి మొదట తలనొప్పి, తల తిరుగడం, సరిగ్గా చూడలేకపోవడం జరుగుతుంది.
శరీరం నుంచి చెమట బాగా వస్తుంది.
ఈ సమయంలో వైద్యం అందకపోతే వ్యక్తి సృహ కోల్పోయి చనిపోయే ప్రమాదం ఉన్నది.
చికిత్స…
చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీరం మీద దుస్తులను తొలిగించాలి.
శరీరాన్ని తడి బట్టతో తుడిచి, తడి బట్టతోనే కప్పాలి.
శరీర ఉష్ణోగ్రత వంద డిగ్రీల ఫారెన్ హీట్స్ తగ్గే వరకు ఇలా చేయాలి.
శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రాగానే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించాలి.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే విధిగా గొడుగులను లేదా నీడ కోసం వస్తువులను తీసుకెళ్లాలి.
నీరసంగా ఉన్నవారు.. ముఖ్యంగా పిల్లలను ఎక్కువ సేపు ఎండలోకి వెళ్లనీయవద్దు.
ఎండలో వెళ్లాల్సి వస్తే తరుచూ నీరు బాగా తాగాలి. అవసరమైతే వీటితో పాటు ఉప్పు, పంచదార కలిపిన నీరు, మజ్జిగ తీసుకోవాలి.
సీజనల్ వారీగా పండ్ల రసాలను తీసుకోవాలి. కొబ్బరి నీరు తాగాలి.
కూల్డ్రింక్స్, శీతల పానీయాలు, ఐస్క్రీం పూర్తిగా నిషేధించాలి. ఇవి శరీరానికి హానికరం అని భావించాలి.
వడదెబ్బ తగిలిన వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తగిన చికిత్స అందించాలి.
వైద్యుడి వద్దకు వెళ్లే లోపు చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్ని తూడ్చాలి.
అవసరమైతే గ్లూకోజ్, స్లైన్, ప్లూయిడ్స్ ఎక్కించాలి.
ఎండాకాలం ముఖ్యంగా 2 నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు అరగంటకోసారి నీరు తాగించాలి.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తల రుమాలు, టోపీలు, చలువ అద్దాలు, మాస్క్లు ధరించాలి.
మెడపై సూర్యరశ్మి పడకుండా టవల్స్ చుట్టుకోవాలి. విధిగా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి.