రైతులు పంట మార్పిడి పాటించక పోవడం, లాభదాయక పంటలపై దృష్టిసారించక పోవడంతో తగిన ఆదాయాన్ని పొందలేకపోతున్నారు. తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నారు. వరి పంటనే కాకుండా ఆరుతడి పంటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్ల తోటలు సాగుచేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వరి పంటనే కాకుండా జామతోటను పెట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మత్తి పురుషోత్తం. ఈయన తనకు ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో అర ఎకరం భూమిలో ఇంటి అవసరాలకు వరి సాగుచేశారు. మిగతా 1.20 ఎకరం భూమిలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందాలనే లక్ష్యంతో కొత్తగా ఆలోచించి జామతోట పెంచుతున్నాడు. జామతోటతో పాటు అంతర పంటలు సాగుచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు.
మిరుదొడ్డి, మే 1 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన రైతు మత్తి పురుషోత్తం జామతోట సాగుచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మంచిర్యాల జిల్లాలోని ఒక గ్రామం నుంచి తైవాన్ జామ రకానికి చెందిన ఒక్కో మొక్కను రూ.40 చొప్పున చెల్లించి 2వేల మొక్కలు ఆయన కొనుగోలు చేసి తీసుక వచ్చాడు. 2021 మార్చి 8న 1.20 ఎకరాల్లో జామ మొక్కలు పెట్టాడు. మొక్కలు నాటే సమయంలో మొక్కకు పూత, కాయలు ఉండే. ముందుగానే పూత, కాయలను 8 నెలల వరకు తెంపి వేయడంతో చెట్లు పెద్దగా పెరిగాయి. ఏడాది వరకు ఒక్కో చెట్టుకు సుమారు 5 కిలోల వరకు జామ కాయల కాత కాసి రైతు చేతికి క్రాప్ వచ్చింది. ఒక్కో జామకాయ సుమారు ఆర కిలోకు పైగానే బరువు ఉంది.
మార్కెట్ సమయాన్ని బట్టి చెట్టునుకాతకు తేవచ్చు..
మార్కెట్లో జామకాయలకు ఉన్న డిమాండ్‌ను బట్టి తోటలో కాపు కాయడానికి ప్రణాళికతో రైతు ముందుకు సాగుతున్నాడు. డిమాండ్‌కు తగ్గట్టుగా రైతు ముందస్తుగా చెట్టుకు ఉన్న కొమ్మలను విరిచి వేసి, చెట్టుకు పూసిన పూత, కాయ పిందెలను తెంపివేశాడు. చెట్టుకొమ్మలు తొలిగించిన ప్రదేశంలో జామ చెట్టుకు మరిన్ని కొమ్మలు అదనంగా పెరుగుతూ 2,3 నెలల్లో జామచెట్టు క్రాప్‌నకు వస్తున్నాయి. ఒక్కో చెట్టుకు 5 కిలోల వరకు జామ కాయలు కాస్తూ రైతులకు కాసుల పంటను కురిపిస్తున్నాయి. రైతు మత్తి పురుషోత్తం తన తోటలో తెంపిన జామ పండ్లను సిద్దిపేట మార్కెట్‌కు తరలించి కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నాడు.
రూ.30 వేలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ఆరుతడి పంటలు, పండ్లతోటలు సాగుచేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పంట పెట్టుడులకు డబ్బులు మంజూరు చేస్తున్నది. 2 వేల తైవాన్ జామ మొక్కలకు గాను రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పథకంలో రైతు మత్తి పురుషోత్తానికి రూ.30 వేలు మంజూరు చేసింది. జామ తోటలో కలుపు తొలిగించడానికి ప్రతినెలా రూ.4500 చొప్పున రైతుకు చెల్లిస్తున్నది. కూలీలతో కలుపు తొలిగిస్తుండడంతో పంట బాగా పండుతున్నది.
జామతో మంచి ఆదాయం ..
నేను పెట్టిన తైవాన్ జామతోటతో నాకు మంచి లాభాలు వస్తున్నాయి. ఒకే పంటలో మరో రెండు పంటలను అదనంగా పండిస్తున్నాను. రైతులు వరి పంటను ప్రధాన పంటగా భావించకుండా ఆరుతడి పంటల సాగుపై దృష్టిని సారిస్తే అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ప్రధానంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే బాగుంటుంది. -మత్తి పురుషోత్తం, రైతు,మిరుదొడ్డి(సిద్దిపేట జిల్లా)
జామతోటకు చీడపీడలు రాకుండా నివారణ చర్యలు..
జామతోటకు ఎలాంటి చీడపీడలు, పిండినల్లి, ఆకుముడత తెగుళ్లు సోకకుండా రైతు మత్తి పురుషోత్తం వేపపిండి, నీమ్ను పిచికారీ చేస్తూ తోటను కాపాడుతున్నాడు. జామ కాయలపై పండు ఈగ వాలి రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పండు ఈగ తన గుడ్లను పెడుతుంది. పండు ఈగ గుడ్లను పెట్టిన 4 రోజుల్లోనే జామకాయ లోపల గుజ్జు పూర్తిగా పురుగులమయంగా మారుతుంది. పండు ఈగ జామకాయపై వాలకుండా ముందస్తుగా రైతు ప్లాస్టిక కవర్లను కట్టి నివారణ చర్యలు తీసుకుంటూ రక్షిస్తున్నాడు. డ్రిప్ ద్వారా నే తక్కువ నీటితో జామతోట సాగుచేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు.
జామలో అంతర పంటలు..
జామతోటతోనే తక్కువ నీటితోనే అంతర పంటలు పండించాలనే ఆలోచనతో రైతు మత్తి పురుషోత్తం టమాట, క్యారెట్ పంటలు పెట్టాడు. టమాట, క్యారెట్ సాగుతో ఏడాది వ్యవధిలోనే రూ.50 వేలు సంపాదించాడు. జామతోటలో తాను పెట్టిన ఖర్చులు పోను ఏడాదిలోనే రైతు సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించాడు. రైతు మత్తి పురుషోత్తం ఆదర్శంగా నిలుస్తున్నాడు.