మెదక్, ఏప్రిల్ 30: కల్తీ విత్తనాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుకు రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్‌రావులతో కలిసి అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ విత్తన భాండాగారమని, మిగతా రాష్ర్టాల్లో ఇతర దేశాల్లో మంచి పేరుందని, ఈ పేరుకు భంగం కలిగించకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా, సమన్వయంగా పనిచేస్తూ తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ర్టాల నుంచి కల్తీ విత్తనాలు తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు విత్తన కంపెనీలు, డీలర్ల సముదాయాల తనిఖీ నిర్వహిస్తూ, ఏవైనా కల్తీ విత్తనాలు దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విత్తనాలు అమ్మకానికి తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేకుండా విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. రైతులు విత్తనాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. దీనిపై వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, పోలీసు శాఖ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ైగ్లెపో సెట్ అనే కలుపు మందు మార్కెట్లో పత్తి పంట వేసిన నెల రోజుల వరకు అమ్మకుండా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరుశురాం, డీఎస్పీ సైదులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, వ్యవసాయ సహాయ సంచాలకులు, అధికారులు పాల్గొన్నారు.