వర్గల్/ రామాయంపేట/ నర్సాపూర్/ నారాయణఖేడ్/ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 30: జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో 2022-23వ విద్యాసంత్సరానికిగానూ శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 5646 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 34 పరీక్షా కేంద్రాల్లో 4274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1372 మంది విద్యార్థులు వివిధ కారణాలవల్ల గైర్హాజరైనట్లు వర్గల్ నవోదయ కేంద్రీయ విద్యాలయ సమితి ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం.సత్యావతి తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో 1456 మంది విద్యార్థులకు గాను 1100 మంది విద్యార్థులు హాజరు కాగా, 356 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. కాగా, రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో 346 మంది విద్యార్థులకు 89 మంది గైర్హాజరయ్యారని పరీక్షల ఇన్చార్జి చీఫ్ సూపరింటెండెంట్ అయిత శ్రీనివాస్ తెలిపారు. నర్సాపూర్ పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 339 మంది విద్యార్థులకు గాను 63 మంది గైర్హాజరైనట్లు నర్సాపూర్ మండల విద్యాధికారి బుచ్చానాయక్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఎంఈవో విశ్వనాథ్ తెలిపారు.