గజ్వేల్, ఏప్రిల్ 23 : ఈ నెల 26వ తేదీన గజ్వేల్ మండలం కొడకండ్ల రైల్వే స్టేషన్ వరకు రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడపనున్నారు. కాచిగూడ నుంచి మనోహరాబాద్, గజ్వేల్ మీదుగా కొడకండ్ల వరకు ఈ ప్రత్యేక రైలు ప్రయాణించనున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో రైల్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొడకండ్ల వరకు రైల్వే లైన్, స్టేషన్ల నిర్మాణం పూర్తికావడంతో పాటు సేఫ్టీ కమిషనర్ పరిశీలన కూడా పూర్తయ్యింది. కమిషనర్ పరిశీలన పూర్తయిన తర్వాత 90రోజుల్లో రైలు నడపాల్సి ఉంటుంది.
మంత్రి హరీశ్‌రావు కూడా ప్రత్యేకంగా రైల్వే బోర్డుకు రైలు ప్రయాణాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని లేఖలు రాయడంతో అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. కరోనా, లాక్డౌన్ తదితర కారణాలతో రెండేండ్లు ఆలస్యం కాగా, ప్రస్తుతం రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెల 26మంగళవారం ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మనోహరాబాద్ మీదుగా కొడకండ్లకు చేరుకుంటుంది. అలాగే, కొడకండ్ల నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక రైలు ప్రారంభమై మళ్లీ మనోహరాబాద్ మీదుగా కాచిగూడకు చేరుకుంటుంది. ఆ తర్వాత సాధారణ రైలు ప్రయాణం రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నెలరోజుల్లోనే సాధారణ రైళ్లు నడిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.