మెదక్, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుకొనేందుకు ఏటా నిధులు కేటాయిస్తున్నది. బతుకమ్మ పండుగకు చీరెలు, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో పేదలు దుస్తులు అందజేసి పండుగలను సంతోషంగా జరుపుకొనేలా చూస్తున్నది. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ గిఫ్ట్ ప్యాక్‌ల (రంజాన్ తోఫా) పంపిణీ చేపట్టింది. ఇందుకోసం మెదక్ జిల్లాకు రంజాన్ కానుకలు చేరుకున్నాయి. వీటి పంపిణీకి జిల్లా మైనార్టీశాఖ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4000 గిఫ్ట్ ప్యాక్‌లను అందజేయనుండగా, మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి కానుకలు పంపిణీ చేయనున్నారు.
కానుకల పంపిణీ ఇలా..
మెదక్ జిల్లాలో రెండు నియోజవకర్గాలు ఉండగా, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి రంజాన్ కానుకలు అందజేయనున్నారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందించి ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్‌లో వారి అవసరాలను గుర్తించి అందించే పండుగ పూట నూతన వస్ర్తాలను ధరించాలని భావించింది. ఈ మేరకు ఖరీదైన దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను తయారు చేయించి అందిస్తున్నది.
రంజాన్ కానుకలు పంపిణీ..
ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా ప్రభుత్వం అందించిన నూతన వస్ర్తాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, పండుగలను సమ దృష్టితో చూస్తుందన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ల పండుగలకు నూతన వస్ర్తాలు పంపిణీ చేసి పేదల కండ్లల్లో ఆనందం చూస్తున్నదన్నారు. మెదక్ నియోజకవర్గానికి 2500 గిఫ్ట్ ప్యాకెట్లు పంచుతున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో షాదీఖానా నిర్మిస్తున్నామన్నారు.
త్వరలో పంపిణీ చేస్తాం..
రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న కానుకలు జిల్లాకు చేరాయి. మెదక్ నియోజకవర్గంలో 2500 మందికి, నర్సాపూర్ నియోజకవర్గంలో 1500 మందికి కానుకలు వచ్చాయి. వీటిని మండలాల వారీగా పంపిణీ కోసం తహసీల్దార్లకు అప్పగించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ రంజాన్ కానుకలను పంపిణీ చేస్తాం. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ గిఫ్టులను అందజేస్తాం.
– జేమ్లానాయక్, మైనార్టీ శాఖ అధికారి మెదక్