సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 22: “కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ” పేరున ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించేందుకు ఈ నెల 24 నుంచి మే 1వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి, నాబార్డు డీడీ కృష్ణ తేజలతో కలిసి బ్యాంకు, వ్యవసాయ, మత్స్య, పశు సంవర్థక, ఉద్యాన వన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ క్యాంపేయిన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ పీఎం కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ నెల 24 నుంచి అన్ని బ్యాం కుల వారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, ఆయా శిబిరాల్లో వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, రెవెన్యూ శాఖలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఎన్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్టు బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని వివరించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి వారం రోజుల్లోగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తారన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి బ్యాంకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్సెక్షన్ వంటివి లేకుండా నేరుగా రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుందన్నారు. లబ్ధిదారులు పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా సంబంధిత బ్యాంకు శాఖల నుంచి కిసాన్ కార్డులు పొందవచ్చని రాజర్షి సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ నర్సింహరావు, ఉద్యానశాఖ అధికారి సునీత, పశు సంవర్థక శాఖ అధికారి వసంత కుమారి, మత్స్యశాఖ అధికారి సతీశ్ కుమార్, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌హెచ్‌జీల పనితీరు పరిశీలన
అస్సాం రాష్ట్రంలో అమలు కోసం బృందం సభ్యుల పర్యటన
పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 22: పటాన్చెరు నియోజకవర్గంలోని మహిళల స్వయం సహాయక గ్రూప్‌ల పనితీరును పరిశీలించేందుకు అస్సాం రాష్ట్రం గౌహాతీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం పలు గ్రామాల్లో పర్యటించింది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ)కి అస్సాంలో కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించింది. పర్యటనలో భాగంగా రాష్ట్ర మిషన్ మేనేజర్ల ఆధ్వర్యంలో పటాన్చెరు మండలంలో ఈ ప్రత్యేక బృందం పర్యటించింది. వీరిని పటాన్చెరు మండల సమాఖ్య బృందం ఆహ్వానించి ముత్తంగి, చిట్కుల్ గ్రామాల్లోని సంఘాల కార్యకలాపాలు చూపించారు. ఆయా వివరాలను తెలుసుకున్న అస్సాం బృందం రూ.2వేల రిసోర్స్ ఫీజ్‌ను చెల్లించి ప్రోత్సహించారు. అనంతరం గ్రామ సమాఖ్య సమావేశాన్ని పరిశీలించి, పనితీరును రికార్డు చేసుకున్నారు.
రిసోర్స్ ఫీజులతో ప్రోత్సాహకం..
గ్రామ సంఘం పనితీరును మెచ్చుకుని రూ.4వేల రిసోర్స్ ఫీజ్‌ను ఇచ్చారు. అనంతరం చిట్కుల్లో సంఘం మహిళలు నడిపిస్తున్న పలు దుకాణాలను చూసి వాటికి వచ్చిన లోన్ వంటి విషయాలను తెలుసుకున్నారు. పటాన్‌చెరులోని మండల సమాఖ్యను సందర్శించి మహిళా సంఘాల ఐక్యత, వాటి పనితీరుపై స్పష్టత తెచ్చుకున్నారు. ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గ్రామ పంచాయతీల తరఫున ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు ఎలా సహకరిస్తున్నది వివరించారు. కార్యక్రమంలో అస్సాం మిషన్ మేనేజర్ ఎంఐఎస్ హృదయ్ భరద్వాజ్, అస్సాం మిషన్ మేనేజర్ ఫైనాన్స్ టీం అభిషేక్, మిషన్ మేనేజర్ ఫాం లైవ్లీహుడ్ నవీన్‌కుమార్, రాష్ట్ర మిషన్ మేనేజర్ ఊర్మిల, కోఆర్డినేటర్ వెంకటేశ్వర్రావు, డీపీఎం రవీందర్, ఏపీఎం శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.