మనోహరాబాద్, ఏప్రిల్21: పేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఖర్చు లేకుండా పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అవి చివరి దశకు చేరుకోవడంతో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకే ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులను ఎంపికచేశారు. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయనున్నారు.
మొదటి విడతగా 177 ఇండ్లు మంజూరు
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం, మనోహరాబాద్ మండలంలోని రామాయిపల్లి, పాలాట, కొనాయిపల్లి పీటీ, మనోహరాబాద్ గ్రామాల్లో సకల వసతులతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మొదటి విడతగా 177 ఇండ్లు మంజూరవగా, ఇప్పటికే వంద శాతం పనులు పూర్తయ్యాయి. ఆహ్లాదకర వాతావరణంలో 33 ఫీట్ల రోడ్లు, వీధి దీపాలు, హరితహారం మొక్కలు, అంతర్గత డ్రైనేజీతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రైవేటు విల్లాలను తలదన్నేలా జీప్లస్ 2 పద్ధతిలో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించారు. కొనాయిపల్లి పీటీలో విడివిడిగా ఇండ్ల నిర్మాణాలు జరుపుతున్నారు.
నాలుగు గ్రామాల్లో 177 ఇండ్లు..
మనోహరాబాద్ మండలానికి మొదటి విడతగా 177 ఇండ్లు మంజూరయ్యాయి. రామాయిపల్లి, పాలాట గ్రామాలకు కలిపి 80 ఇండ్లు, మనోహరాబాద్‌లో 72 ఇండ్లు, కొనాయిపల్లి పీటీలో 25 ఇండ్లు మంజూరయ్యాయి. కాగా ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు ఖర్చు చేసి అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్, వాటర్ ట్యాంకులు, స్విచ్ బోర్డులు, తలుపులు వంటి పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇవి కూడా రోడ్డుకు చేరువలో ఉండేలా స్థలాన్ని సేకరించి నిర్మించారు. రామాయిపల్లిలో జాతీయ రహదారికి ఆనుకుని జీప్లస్ 2 పద్ధతిలో ఇండ్లను నిర్మించారు.
రోడ్లు, అంతర్గత డ్రైనేజీకి ప్రత్యేక నిధులు
డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తవడంతో అధికారులు ఇండ్ల మధ్య రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలపై దృష్టి సారించారు. భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఇండ్ల మధ్య ఖాళీ స్థలాన్ని వదిలారు. అందులో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరుచేశారు. రామాయిపల్లిలో రూ.52 లక్షలు, మనోహరాబాద్‌కు రూ.50 లక్షలు, కొనాయిపల్లి పీటీకి రూ.16 లక్షలు అదనంగా మంజూరుచేశారు. వీటితో ఇండ్ల మధ్యలో వదలిన 33 ఫీట్ల ఖాళీ స్థలంలో 18 ఫీట్ల సీసీరోడ్డు నిర్మించారు. సీసీ రోడ్డు ఇరుపక్కలా మిగిలిన స్థలాన్ని హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు, విద్యుత్ స్తంభాలకు, పార్కింగ్‌కు ఉపయోగపడేలా ప్లానింగ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు, ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. మిషన్ భగీరథ కనెక్షన్‌ను నేరుగా ట్యాంకుకు అనుసంధానం చేశారు.
మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో అందజేత
నూతనంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రామాయిపల్లిలో 165, పాలాటలో 105, మనోహరాబాద్‌లో 238, కొనాయిపల్లి పీటీలో 69 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో మూడు, నాలుగు సార్లు గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపికచేశారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా అర్హులను ఎంపికచేశారు. నిర్మాణం పూర్తైన ఇండ్లను పలుమార్లు క్వాలిటీ చెక్కింగ్లు చేయించారు. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు ఈ 177 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
మనోహరాబాద్, రామాయిపల్లి, పాలాట, కొనాయిపల్లి పీటీ గ్రామాల్లో 177 ఇండ్లు నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి, అభిప్రాయాలు సేకరించాం. మధ్యవర్తులు, నాయకులు, పైరవీల ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశాం. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లను అందజేయనున్నారు.
– శ్యాంప్రకాశ్, ఆర్డీవో, తూప్రాన్.