మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 19: పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం అందరిని ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల తరువాత పరీక్షలకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వందశాతం ఉతీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపిస్తున్నారు.
కరోనా మహమ్మారి సాధారణ జనజీవనంతో పాటు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసింది. రెండేళ్ల పాటు తరగతులు నిర్వహించని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా, ఉపాధ్యాయుల బోధనలు జరగకుండా, పరీక్షల జరగకుండా పై తరగతులకు చేరుకున్నారు. దీనివలన విద్యార్థులకు బోధన సామర్థ్యాలు సైతం కాస్త పడిపోయాయి. ఈ నేపథ్యంలో 2019-20, 2020-21 విద్యా సంవత్స రంలో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయకుండానే ప్రభుత్వం ఉతీర్ణత చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇంటర్‌కు సైతం పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. కరో నా తగ్గుముఖం పట్టడంతో ఈ విద్యా సంవత్సరం పది పరీక్షలు నిర్వహించటం జరుగుతోంది. విద్యాశాఖ మే 23 నుంచి పరీక్షల నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది.
సన్నద్ధతపై సమీక్షిస్తున్నప్రధానోపాధ్యాయులు
పరీక్షలు దగ్గర పడుతుండటంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు పాఠ్యాంశాల పూర్తికి విద్యార్థుల సన్నద్ధతపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున ప్రతి రోజు రెండు గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజువారి, వారంతపు పరీక్షలు సైతం నిర్వహిస్తూ విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు.
జిల్లాలో పరీక్ష రాయనున్న 11,394మంది విద్యార్థులు
జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు గురుకులాలు, ఎయిడెడ్, కస్తూర్బా, మోడల్ పాఠశాలలో కలిపి 11,394మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలికలు 5,723, బాలురు 5,671 మంది ఉన్నారు.
ఈసారి 6 పేపర్లే..
ఈ విద్యాసంవత్సరంలో జరిగే ప్రశ్నాపత్రం సైతం మారనుంది. ఇంతకు ముందు 11 పేపర్లకు బదులు ఈసారి 6 పేపర్లకే పరీక్షలు జరుగనున్నాయి. జనవరి 10లోపే పూర్తి కావాల్సిన సిలబస్ సంక్రాంతి సెలవులు, కరోనా థర్డ్‌వేవ్ తో ఇప్పుడిప్పుడే సిలబస్ పూర్తికావోస్తుంది. వందశాతం సిలబస్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు కొసాగిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రతి విద్యార్థిపై దృష్టి..
ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టి వారిలోని సామర్థ్యాలను పరీక్షిస్తున్నాం. రెండేళ్లుగా కరోనా వలన పరీక్షలు నిర్వహించలేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. అందుకే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉతీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం.
– సుదర్శనమూర్తి, ఉమ్మడి మెదక్ జిల్లా పరీక్షల బోర్డు సభ్యుడు