మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాకి జిల్లాలో 313 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు గుర్తించాం. ఆయా పాఠశాలల్లో పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మన ఊరు-మన కార్యక్రమంపై మంగళవారం జిల్లా విద్యాశాఖధికారి రమేశ్‌కుమార్‌తో పాటు ఇంజినీరింగ్ అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు గుర్తించి అంచనా వ్యయం ప్రతిపాదనలు రూపొందించి అనుమతులు ఇవ్వడంలో అలసత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై ఇంజినీరింగ్ అధికారులు సాకులు చెప్పకుండా వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి యూ-డైట్ ప్రకారం 10 శాతం వ్యయం మించకుండా ప్రతిపాదనలు రూపొందించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజాధనం వృథా కాకుండా కాపాడేందుకు సాధ్యమైనంత మేర అంచనా వ్యయాన్ని కుదించే అవకాశాలను పరిశీలించాలని, అవసరమైన చోట నిధులు ఖర్చు చేయడంలో రాజీ పడకూదన్నారు.
పంచాయతీరాజ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి 12 రకాల పనులు చేపట్టాలని లక్ష్యం. కాగా, ఇప్పటి వరకు 149 పాఠశాలలకు సంబంధించి అంచనాలు మాత్రమే రూపొందించి 40 పాఠశాలలకు మాత్రమే పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై ప్రతిమాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు కొరత లేదని జిల్లాకు రూ.3 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో రూ.30లక్షల లోపు ఆపైన కావాల్సిన వాటికి అంచనా నివేదికలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే డీఈవో సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో ప్రహరీ, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు విద్యార్థుల సంఖ్యను బట్టి అదనపు తరగతుల గదుల నిర్మాణాలు చేపట్టాల్సిన పాఠశాలలను గుర్తించి నివేదిక పంపాలని ఆదేశించారు.
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలోని పరిమితులను ప్రజాప్రతినిధులకు వివరించి వారి సహకారంతో నిబంధనల మేరకు పనులు చేపట్టాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పీఆర్ ఎస్ఈ కనకరత్నం, ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, దినేశ్‌కుమార్, సెక్టోరియల్ అధికారులు సూర్యప్రకాశ్, సుభాశ్, జ్యోతి, ప్రత్యేక బృందాల అధికారులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, సదన్‌కుమార్, ఎంఈవోలు యాదగిరి, నీలకంఠం, బుచ్యా, అధికారులు పాల్గొన్నారు.