మెదక్, ఏప్రిల్ 18: మెదక్ కలెక్టరేట్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభమైంది. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించతగ్గవి పరిష్కరించి, మిగతా వాటికి పరిష్కార మార్గాలు చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, భూ నిర్వాసితులు, ఉపాధి పనులు కల్పించాలని, బ్యాటరీ సైకిళ్లు ఇప్పించాలని కోరుతూ 26 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సూచించారు. మెదక్ పట్టణంలోని పిట్లం చెరువులో మిగిలి ఉన్న నీటిని కాపాడాలని 23వ వార్డు కౌన్సిలర్ అవారి శేఖర్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. పిట్లం చెరువులో ని నీటిని బెస్త, నీరడి వారు చెరువు వెంబడి ఉన్న బీడు భూముల ద్వారా కాల్వలకు పంపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చుట్టుపక్కల గల బోరు బావుల్లో నీరు తగ్గిపోయి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అనంతరం స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ కరోనా తగ్గుముఖం పట్టినందున ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని, అందరూ అధికారులు హాజరవుతారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సోమవారంలోగా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
ఎస్పీ కార్యాలయంలో..
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. మెదక్ పట్టణం వెంకట్రావ్‌నగర్ కాలనీకి చెందిన గుండు కనకమ్మను తన భర్త, అత్తమా మ, మరిది వేధిస్తున్నారని, తన భర్త వారి ఫ్రెండ్స్‌ను ఇం టికి తీసుకొచ్చి అర్ధరాత్రి వరకు తాగుతున్నారని ఆరోపించింది. ఈనెల 17న తమ అమ్మగారి ఇంటికి వెళ్తే తన భర్త అక్కడికి అర్ధ రాత్రి వచ్చి బూతులు తిడుతూ, తలుపులు పగలగొట్టాడని, అతనితో తనకు ప్రాణభ యం ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. మెదక్ పట్టణం పిట్లంబేస్ బారహిమామ్ వీధికి చెందిన నీంగమయుల దుర్గమ్మ తమ ఇంటి పక్కన గల కటికె హరిలాల్ తూర్పునకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకున్నా అరసంది కానీ సెట్ బ్యాక్ విడువకుండా 3 సెప్టిక్ ట్యాంకులకు సంబంధించిన డ్రైనేజీ పైపులు వేస్తున్నారని, ఆ విషయంలో అడ్డుకున్నందుకు తమను బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.