మెదక్, ఏప్రిల్ 16 : ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఈ నెల 18 నుంచి 22 వరకు జిల్లావ్యాప్తంగా ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఎంఎల్పీ డాక్టర్లతో వర్చువల్ వీడియో ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఈ నెల 18న మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్స్‌లో మెదక్ డివిజన్ పరిధి లో ఆరోగ్య మేళా ఉంటుందని, 20న తూప్రాన్ డివిజన్లో, 22న నర్సాపూర్ డివిజన్లో ఆరోగ్యమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మేళాలో వైద్యనిపుణులతో ఉచిత వైద్యం, ఔషధాల పంపిణీ, ల్యాబ్ పరీక్షల నిర్వహణతో సహా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తామన్నారు. ఆరోగ్యమేళాలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం చేస్తామని తెలిపారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహిస్తున్న ఆరోగ్యమేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎన్సీడీ డాక్టర్ అంబిక, డాక్టర్లు నవీన్, అనీల, పాండురగాచారి, సీహెచ్‌వో చందర్, విజయేందర్, ఫయీంపాషా, ఏఎంవోలు కుమారస్వామి, మాధవరెడ్డి పాల్గొన్నారు.