మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట, ఏప్రిల్ 10 : భారతీయ విద్యావిధానంతో ఆదర్శ వ్యక్తుల నిర్మాణమే లక్ష్యంగా శ్రీరామ నవమి రోజున సరస్వతీ విద్యాపీఠం ప్రారంభమైనదని.. శిశుమందిరాలు నైతిక విలువలతో కూడిన విద్యనందిస్తాయని శిశుమందిర్ కార్యదర్శి మచ్చేంద్రనాథ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం మెదక్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో విద్యాపీఠం ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యం లో తెలుగు రాష్ర్టాల్లో 500 పైగా శిశుమందిరాలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, సంస్కార కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. సదాచారం, దేశభక్తి, ధర్మనిష్ట, సంస్కారంతో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా సరస్వతి విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గంజి శ్రీనివాస్, కోశాధికారి రవీందర్, కాశీనాథ్, నారాయణ, ప్రధానాచార్యురాలు సుధారాణి, ఆచార్యులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలు
సరస్వతి శిశుమందిరాలు సంస్కృతికి నిలయాలని ప్రధానోపాధ్యాయుడు వీరప్ప అన్నారు. పెద్దశంకరంపేటలో సరస్వతి విద్యాపీఠం ఆవిర్భవ వేడుకలు నిర్వహించారు. శిశుమందిరాలు దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తుందన్నారు. 1967లో గోరఖ్‌పూర్‌లో శిశుమందిర్ ప్రారంభించారని, నిర్మల్‌లో 1970లో, పెద్దశంకరంపేటలో 1980లో శిశు మందిరం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం ఆచార్యులను పూర్వవిద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణాసుభాష్గౌడ్, పాఠశాల కమిటీ అధ్యక్షుడు దాదిగారి గంగాధర్, సభ్యులు రవివర్మ, జైహింద్‌రెడ్డి, పున్నయ్య, సాయిలు, పూర్వ విద్యార్థులు కృష్ణమూర్తి, సీతారామరావు, సతీశ్‌గౌడ్, ప్రభాకర్ పాల్గొన్నారు.