మెదక్ మున్సిపాలిటీ/ నర్సాపూర్/ పాపన్నపేట/ న్యాల్కల్ ఏప్రిల్ 9: శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణానికి ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని కోదండ రామాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పూజా కార్యక్రమాలు
వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం కనుల పండువగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సుప్రభాతసేవ, గురుపూజ, సీతారామ చంద్రస్వామి కల్యాణం, హారతి, తీర్థప్రసాద వితరణ, అన్నదానం, బండ్ల ఊరేగింపు, సోమవారం సుప్రభాతసేవ, భవానీ రామలింగేశ్వర స్వామి అభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, బండ్ల ఊరేగింపు, పల్లకీ సేవ, మంగళవారం సుప్రభాతసేవ, శ్రీరామ మూలమంత్ర హవనం, శ్రీ చండీ సప్తశతి మహాయాగం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మెదక్ కోదండ రామాలయంలో..
శనివారం అగ్ని ప్రతిష్ఠహవనం, హోమం, ధ్వజరోహణం, బలి హరణం, అరగింపు తదితర పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం నిత్యహోమం, 11 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు కోదండ రామాలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ తెలిపారు. సీతారామ కల్యాణ మహోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారన్నారు.
న్యాల్కల్లో వేడుకల ఏర్పాట్లు ముమ్మరం
శ్రీరామ నవమి వేడుకలను న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేశారు. మండలంలోని కాకిజనవాడ, హద్నూర్, గుంజోట్టి, మామిడ్గి, రాంతీర్థం, హుస్సేనగర్, న్యాల్కల్, వడ్డి, హుస్సేల్లి తదితర గ్రామాల్లోని శ్రీరామ మందిరాలతో పాటు హనుమాన్ మందిరాల్లో భజరంగ్‌దళ్, ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు.
సీతారాముల కృపకు పాత్రులుకండి
లోక కల్యాణార్థం ప్రతి ఏటా నిర్వహించే సీతారామచంద్ర స్వామి కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రులుకావాలి. ఈ వేడుకలకు అందరు ఆహ్వానితులే. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం.
– హరిప్రసాద్ శర్మ, ఆలయ ధర్మకర్త, సీతారాంపూర్