రాయికోడ్, ఏప్రిల్ 9: ఆయన మనోధైర్యం ముందు అంగవైకల్యం బలాదూర్ అయ్యింది. ఏదైనా సాధించాలనే పట్టుదల ఆయనను ముందుకు నడిపించింది. తన తండ్రి వద్ద నేర్చుకున్న ఈతనే తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నాడు. అందులో రాణించి, ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించి తన ప్రతిభను చాటాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన కుస్నూర్ మల్లేశం, వినోదమ్మ కుమారుడు కుస్నూర్ శివకుమార్.
ఈతపై మక్కువతో..
చిన్నప్పుడు పాము కరవడంతో కుడికాలు వెనుకకు తిరిగింది. దీంతో శివకుమార్ కుంగి పోకుండా ఉన్నత విద్యనభ్యసించాడు. అంతేకాకుండా తన తండ్రి వద్ద సరదాగా నేర్చుకున్న ఈతను తన జీవిత లక్ష్యంగా మలుచుకున్నాడు. అంగవైకల్యం ఉన్నవారికీ పోటీలు నిర్వహిస్తారని తెలుసుకున్నాడు. 2016లో లోయర్ ట్యాంక్‌బండ్ స్విమ్మింగ్ పూల్‌లో శిక్షణ పొందేందుకు చేరాడు. కోచ్ దినేశ్ రాజోరియ శిక్షణ ఇచ్చారు. కోచ్ సహకారంతో తన ప్రతిభను చాటాడు.
అవార్డులు..
2017లో జరిగిన నేషనల్ లెవల్ పోటీల్లో శివకుమార్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. నేషనల్లో బంగారు పథకం సాధించాలనే పట్టుదలతో మూడేండ్లు తీవ్రంగా కృషి చేశాడు. 2021 బెంగళూర్‌లో జరిగిన నేషనల్ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో మొదటి స్థానం సాధించి బంగారు పథకం అందుకున్నాడు. 2022లో రాజస్థాన్‌లో జరిగిన నేషనల్ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో మొదటి స్థానం సాధించి బంగారు పథకం అందుకున్నాడు.
ఈ విజయం అంగవైకల్య ఆటగాళ్లకు అంకితం
నేషనల్ లెవల్ స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించడం ఎంతో సంతోషం కలిగించింది. ఈ పథకాన్ని అంగవైకల్యంతో బాధపడుతున్న యువతకు అంకితం ఇస్తున్నా. అంగవైకల్యంతో బాధపడుతున్న వారు మనోధైర్యం కోల్పోవద్దు. పట్టుదలతో ఏదైన సాధించవచ్చు. నా విజయానికి కారణమైన తల్లిదండ్రులు, కోచ్‌లకు ధన్యవాదాలు.
– కుస్నూర్ శివకుమార్, సింగితం, రాయికోడ్