చౌటకూర్, ఏప్రిల్8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో సర్కారు కొత్త ఒరవడి శ్రీకారం చుట్టింది. కాగా ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, మౌలిక వసతులు మెరుగుదలే లక్ష్యంతోపాటు ఆంగ్ల మధ్యమంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి పేదల అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మండలంలోని శివంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పాఠశాలలో మొత్తం 420 మంది విద్యార్థులు ఉంన్నారు. ఇందులో పదో తరగతికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో 51, తెలుగు మీడియంలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా వారందరూ ఆయా క్లాసుల్లో చదువుకుంటున్నారు. కాగా 2018లో 356మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 420కి పెంచేందుకు పాఠశాల అధ్యాపక బృందం కృషి చేసింది.
పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు అయినప్పటి నుంచి 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ తమదైన శైలిలో పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పాఠశాల అభివృద్ధికి నిర్మన్ స్వచ్ఛంద సంస్థ కేరియర్ సహకారంతో పాఠశాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. గ్రామ సమీపంలోని బీర్ ఫ్యాక్టరీ సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, ఫర్నిచర్ తదితర వాటిని అందజేసినట్లు తెలిపారు. సమీపంలోని రైస్ మిల్లుల సహకారంతో మధ్యాహ్నం భోజనం చేసేందుకు విద్యార్థులకు కావాల్సిన ప్లేట్లను అందజేసినట్లు హెచ్ఎం తెలిపారు. శివంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధితో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ మండలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి, దాతలకు పాఠశాల అధ్యాపక బృందం కృతజ్ఞతలు తెలిపారు.
ఆంగ్ల మాధ్యమంలో శివంపేట ప్రథమం
మండలంలోనే శివ్వంపేట జడ్పీహెచ్ఎస్ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్నది. 2015, 16, 17, 18, 19ల్లో ఆంగ్ల మాధ్యమంలో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. తమ పాఠశాలలో 420 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారం కూడా ఉంది. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తే జిల్లా స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తాం.
-ఎర్రోళ్ల ప్రభాకర్, హెచ్ఎం
బోధనా తీరు చాలా బాగుంది
చౌటకూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరు చాలా బాగుంది. వారు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటున్నాం. దీంతో సులువు గా అర్థమవుతున్నాయి. భవిష్యత్లో కూడా పాఠశాలకు మంచి పేరు తెస్తాం. పది పరీక్షల్లో ఈసారి కూడా 100 శాతం ఉత్తీర్ణత శాతం సాధిస్తాం.
– సంతోష్, విద్యార్థి, 10వ తరగతి
ప్రతి ఆదివారం ప్రత్యేక తరగతులు
పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం ప్రతి సబ్జెట్కు సంబంధించి ఒక ఉపాధ్యాయుడిని నియమించి బోధిస్తున్నారు. దీంతో తాము కూడా ప్రత్యేక తరగతులకు వెళ్తున్నాం. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరు చాలా బాగుంది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
– వర్షిత, విద్యార్థి, పదో తరగతి