మెదక్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకుఠిత దీక్షతో పోరాడిన యోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా సమాజంలోమార్పు కోసం వ్యక్తిగా, శక్తిగా 50 సంవత్సరాల పాటు అలుపెరుగని యోధుడిగా పోరాడారన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ 115 జయంతి సందర్భంగా మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ సమాజ మార్పు కోసం పరితపించిన మహనీయుడన్నారు.
సుందరీకరణలో భాగంగా మెదక్ పట్టణంలో తొలగించిన బాబూ జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ విగ్రహాలను యధాస్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు ఎకరాల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో అంబేద్కర్ భవనం, అందులో స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామని, నిర్వహణ కోసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో 6 ఎకరాల్లో గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. అర్హులందరికీ దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తామని తెలిపారు.
అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ చరిత్ర తెలుసుకుంటేనే చరిత్రను సృష్టించగలుగుతామన్నారు. జగ్జీవన్‌రామ్ చిన్న తనంలోనే బ్రిటీష్ ప్రభుత్వంలో పార్లమెంట్‌కు వెళ్లి గళాన్ని విప్పాడని, రాజ్యాంగ నిర్మాణంలో దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం పలు సూచనలు చేశారన్నారు. వివిధ శాఖలకు కేబినెట్ మంత్రిగా పనిచేసి ఆ శాఖలకు వన్నె తెచ్చాడన్నారు. అలాంటి మహనీయుడి ఆశలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఎస్పీ రోహిణిప్రియదర్శిని మాట్లాడుతూ సమానత్వం మాటల్లో కాదు ఆశయంతో ఉండాలన్నారు.
రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించిందని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దళితులకు సూచించారు. అంతకుముందు పట్టణంలోని వెల్కంబోర్డు వద్ద ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న రెండు జంటలకు ఎమ్మెల్యే రెండున్నర లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్‌ను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, డీఈవో రమేశ్‌కుమార్, దళిత సంఘం నాయకులు మురళీ, రామస్వామి, బొందుగుల నాగరాజు, అనంతరాం, శంకర్, భాస్కర్, పాతూరి రాజు, మాసాయిపేట యాదగిరి, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.