దుబ్బాక టౌన్, ఏప్రిల్ 3 : దేశ ప్రజానీకంపై ఆర్థికభారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.భాస్కర్ అన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలపెంపునకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం దుబ్బాకలోని బస్స్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. బీజేపీ చర్యల వల్ల నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నదన్నారు. పెట్రో, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పలుమార్లు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో నాయకులు స్వామి, కొంపెల్లి భాస్కర్, రాజు, భాను, దేవయ్య, బాల్రాజు, గణేశ్, యాదగిరి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.