సంగారెడ్డి, మార్చి 30: పల్లెల అభివృద్ధికి ఎన్నుకోబడిన పాలకవర్గం పంచాయతీ నిధులను గోల్మాల్ చేస్తూ, చేతివాటం ప్రదర్శించారు. లక్షల్లో నిధులు దారి మళ్లించిన పాలకవర్గం సభ్యులు జేబులు నింపుకొన్నా అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఎంపీవో శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్రీధర్ స్వామి సమక్షంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ ఫౌండర్ మంచికట్ల అనిల్ కుమార్ పర్యవేక్షణలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ (I)(1) ప్రకారం పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. సిటిజన్స్ బృందం తనిఖీల్లో పంచాయతీ నిధులు రూ.35 లక్షలు దుర్వినియోగం అయినట్లు సభ్యులు ధ్రువీకరించారు. ఈ నిధులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు.
పంచాయతీలో మొత్తం 26 తీర్మానాలకు గాను 20లో ఏ ఒక్కరి సంతకం లేకపోవడం శోచనీయం. రెండు తీర్మానాల్లో మాత్రమే సంతకాలు పెట్టినట్లు వారు గుర్తించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఆన్లైన్లో 7500 ఉంటే క్షేత్రస్థాయిలో ఒక్కటికూడా లేదని బృందం సభ్యులు గుర్తించారు. ఈ విషయాలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించనున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో సీసీఆర్ రాష్ట్ర కార్యదర్శులు ప్రభు, సుందరాంగుడు, సీహెచ్.బాబు, ఎండి.అహ్మద్, శ్రవణ్ కుమార్‌గౌడ్, జిల్లా బాధ్యులు మోహన్ దాస్, సలహా కమిటీ కార్యదర్శి మణికంఠ, సీసీఆర్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.