ప్రాజెక్టులోకి చేరుతున్న గోదావరి జలాలు
మత్తడి దూకిన మాసాయిపేట చెక్‌డ్యాం
మంగళవారం ఉదయం నాటికి ప్రాజెక్టు నిండే అవకాశం
పరీవాహక ప్రాంత రైతుల హర్షం
వెల్దుర్తి మండలంలోని ఎనిమిది చెక్‌డ్యామ్‌ల్లో జల సవ్వడి
వెల్దుర్తి, మార్చి 27: ఎండిపోతున్న పంటలకు పునరుజ్జీవం తీసుకురావడానికి కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా వదిలిన గోదావరి జలాలతో మండల కేంద్రం మాసాయిపేట శివారు హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాం మత్తడి దుంకుతున్నది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలోకి ప్రవేశించిన నీళ్లు రాత్రి వరకు మాసాయిపేట చెక్‌డ్యాంకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామూన మాసాయిపేట చెక్‌డ్యాం పొంగి కాళేశ్వరం నీళ్లు కిందకు ప్రవహిస్తున్నాయి. కాగా రెండో రోజైన ఆదివారం సుమారు కిలోమీటరున్నర మేర ప్రవహించి హల్దీ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. సోమవారం రాత్రి వరకు లేదా మంగళవారం ఉదయానికి హల్దీ ప్రాజెక్టు పొంగిపొర్లే అవకాశం ఉన్నది. ఎన్నడూ లేని విధంగా ఎండాకాలంలో హల్దీవాగులో నీళ్లు ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేవు. వాగులో నీళ్లు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడగా, సరైన సమయంలో వదిలిన కాళేశ్వరం జలాలతో పంటలను రక్షించుకోవడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరగడం, తాగునీటి ఇబ్బందులు సైతం తొలగిపోతాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హల్దీ ప్రాజెక్టుతో పాటు వెల్దుర్తి మండలంలో ఉన్న ఎనిమిది చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకోనున్నాయి.
తీరిన నీళ్ల గోస
వాగును నమ్ముకొని పంటలు పం డిస్తున్నాం. యాసంగికి నీటి గోస తప్పేదికాదు. పంటలు పెరిగే యా ళ్లకు వాగులో నీళ్లు లేక, పంటలు ఎండిపోయేవి. ఎండాకాలంలో వాగుల్లో గోదారినీళ్లు వస్తుండడంతో నీళ్లగోస తీరింది. ఇప్పుడు పంటలు ఎండిపోతలేవు. దీంతో ముందుగానే వానాకాలం పంటలు వేస్తున్నాం. సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలే.
–సత్తయ్య, రైతు, బొమ్మారం
పంటలు ఎండేయాళ్లకు నిలొచ్చాయి..
ఎండలు ముదిరి పంటలు ఎండిపోయే యాళ్లకు వాగులో నీల్లొచ్చాయి. ఈ నీళ్లతో పంటలు కాపాడు కోవడంతో పాటు తాగడానికి ఇబ్బందులు పోయా యి. వానలు బాగా పడ్డప్పుడు మాత్రమే వాగులో నీళ్లు పారేవి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండల్లో కూడా చెక్‌డ్యాం పొర్లుతున్నది. ఎండల్లో నీళ్లు సూస్తామని ఎప్పుడు అనుకోలేదు.
–బాలమల్లయ్య, రైతు, బొమ్మారం