నారాయణఖేడ్, మార్చి 26 : దళితులంతా కోటీశ్వరులవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి వందశాతం సబ్సిడీపై రూ.10 లక్షల నిధులతో స్వయం ఉపాధి కల్పిస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నా రు. శనివారం నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామం లో 95 కుటుంబాలకు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి దళితబంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తొలివిడుత దళితబంధు పథకంలో భాగంగా ఒకేసారి వందశాతం దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంతో రుద్రారం గ్రామం ప్రత్యేకంగా నిలిచింద ని, ఇది కలెక్టర్ హనుమంతరావు సహా జిల్లా అధికారులు చేసి న కృషితోనే సాధ్యమైందన్నారు. దళితబంధు పథకానికి సార్థకత లభించాలంటే లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకుని, సక్రమంగా వ్యాపారాలు చేసుకోవాలన్నారు.
రుద్రారం ఆదర్శంగా నిలవాలిః కలెక్టర్
రుద్రారం గ్రామ లబ్ధిదారులు ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఏడాది తర్వాత గ్రామంలో దళితబంధు విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తామని, అప్పుడు తమ విజయగాథలు చెప్పుకునే విధంగా లబ్ధిదారులు పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. దళితబంధు కోసం రుద్రారం గ్రామాన్ని ఎంపిక చేయడంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా జూకల్ శివారులో రూ.94.50 లక్షలతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్, రూ.1.35 కోట్లతో కేజీబీవీ పాఠశాల అదనపు భవనం, రూ.65 లక్షలతో ఆక్సిజన్ పార్క్, రూ.3కోట్లతో సమీకృత సంక్షేమ వసతిగృహం, రూ. 75 లక్షలతో సమీకృత పశువైద్యశాల భవనానికి ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే, పట్టణంలో జడ్పీహెచ్ఎస్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నియోజకవర్గంలోని 370 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్, పశుసంవర్ధకశాఖ జేడీ వసంతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీబాయి, మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్, సర్పంచ్‌లు సువర్ణ ప్రభాకర్, సంగమ్మ పాల్గొన్నారు.