మనోహరాబాద్, మార్చి 20 : ప్రియుడితో సహజీవనం చేస్తుందని కూతురును తల్లి మందలించినందుకు ఆ తల్లినే హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్‌లోని ఉప్పుగూడ వద్ద నివాసం ఉండే జక్కుల రాధ (56) కోఠి, నారాయణగూడ పరిధిలో భిక్షాటన చేసుకుంటూ తన కూతురు జక్కుల చంద్రకళతో కలిసి నారాయణగూడలో ఉంటుంది.
చంద్రకళ కూడా నారాయణగూడలోని శాంతి టాకీసు వద్ద భిక్షాటన చేస్తుంటుంది. చంద్రకళకు నారాయణగూడలో రోడ్డు పక్కన బొ మ్మలు అమ్ముకునే కీరాజితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమం లో తన తల్లికి తెలియకుండా చంద్రకళ, కిరాజీలు వివాహం కాకుండానే పదమూడేండ్లుగా కాపురం పెట్టారు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. విషయం తెలిసిన చంద్రకళ తల్లి రాధ కూతురును నిలదీసింది. అతనితో ఉండవద్దని వారించింది. తరుచూ తనను తిట్టడంతో చంద్రకళ ఆమె ప్రియుడు కీరాజితో కలిసి తల్లి రాధ ను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న నగదు, బంగా రం, వెండి ఆభరణాలు తీసుకోవాలని పథకం పన్నారు.
ఈ విషయమై కీరాజి, చంద్రకళలు 2020అక్టోబర్11న రాధను కలిసి మాట్లాడుదామని పిలిచి మద్యం తాగారు. చంద్రకళ, కీరాజి ఓ ఆటో కిరాయికి తీసుకొని రాధతో కలిసి బయలుదేరారు. మార్గమధ్యలో కీరాజికి పరిచయం ఉన్న లక్కీ, సలీంలను ఆటోలో ఎక్కించుకొని మెదక్ జిల్లా మనోహరాబాద్ వైపు వచ్చారు. మనోహరాబాద్ శివారులో జాతీయ రహదారి పక్కన ఓ గేటు వద్ద పథకం ప్రకారం రాధను బండరాతితో మోది, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి హత్య చేశారు. హత్య అనంతరం నలుగురు కలిసి నగరానికి చేరుకొని మృతురాలు రాధ దాచుకున్న రూ. 4లక్షల నగదు తీసుకున్నారు.
అందులో నుంచి రూ. 50వేల ను లక్కీ, సలీంలకు ఇచ్చి మిగిలిన వాటితో చంద్రకళ, కీరాజ్లు గుజరాత్‌కు వెళ్లి జల్సా చేశారు. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తిరిగి నగరానికి చేరుకున్నారు. కనిపించకుండ పోయిన రాధ గురించి చంద్రకళను మృతురాలు బంధువులు నిలదీయగా అసలు విషయం ఒప్పుకుంది. ఆదివారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు బంధువులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. నిందితులు చంద్రకళ, కీరాజిలను గజ్వేల్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. కేసును చేధించిన సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజుగౌడ్, సిబ్బందిని అభినందించారు.